కాదేదీ పబ్లిసిటీకి అనర్హం.. అన్నట్టు తయారైంది ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తీరు. జనం గుమికూడకూడదు మొర్రో.. అని ఓ పక్క ప్రభుత్వాలు కుండబద్దలుగొట్టేస్తున్నా, ఆంక్షలు విధిస్తున్నా.. ‘మాకేం పట్టదు’ అన్నట్టు టీడీపీ వ్యవహరిస్తోంది. కరోనా నేపథ్యంలో వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవని నిరసన తెలిపేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధమైతే, పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని అడ్డుకోవాల్సి వచ్చింది. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో పోలీసులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం తెలుగుదేశం పార్టీకి తగునా.? అన్న చర్చ సాధారణ ప్రజల్లో జరుగుతోంది. డాక్టర్ సుధాకర్ ఇటీవల కరోనాతో మరణించిన దరిమిలా, ఆయన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ వెళ్ళారు.
ఈ క్రమంలో కొంత హంగామాకి టీడీపీ శ్రేణులు ప్రయత్నించారుగానీ, వాళ్ళ పప్పులుడకలేదు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి కొన్ని హక్కులతోపాటు బాధ్యలూ వుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బాధితుల్ని ఆదుకునేందుకు టీడీపీ సేవా కార్యక్రమాలు చేస్తే మంచిదే. కానీ, రాజకీయ కార్యక్రమాలేంటి.? నిరసన తెలిపేందుకూ ఓ హద్దు వుంటుంది. సమయం, సందర్భం వుంటుంది. ‘మీరు కరోనా వేళ, పాలన పక్కన పెట్టి, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా.. రాజకీయ కుట్రలకు తెరలేపి, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తే తప్పులేదుగానీ..’ అంటూ టీడీపీ నేతలు దీర్ఘాలు తీస్తున్నారు.
ప్రభుత్వం తప్పు చేస్తే, కోర్టులెలా వున్నాయ్.. మొట్టికాయలు పడతాయ్.. అది వేరే సంగతి. నాయకులెవరైనా బాధ్యత విస్మరించి వ్యవహరిస్తే, అది అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం గుమికూడేలా ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు వ్యవహరించినా.. అది వారికి ప్రజల పట్ల కనీస బాధ్యత లేకపోవడంతో చేసిన చర్యగానే భావించాల్సి వస్తుంది.