దేశంలో కరోనా తీవ్రత చాలా దారుణంగా వుంది. అధికారిక లెక్కలకీ, కింది స్థాయి పరిస్థితులకీ పొంతనే వుండడంలేదు. నిత్యం దేశంలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇంతా జరుగుతున్నా కేంద్రం ఏం చేస్తోంది.? అన్న ప్రశ్న సాధారణ ప్రజానీకంలో వినిపించడం మామూలే. ‘మోడీ ఫెయిల్డ్ పీఎం’ అని దేశమంతా నినదిస్తోంది. కేంద్రం ఏమీ చేయడంలేదనడం సరికాదు. కానీ, చెయ్యాల్సిన స్థాయిలో మాత్రం చెయ్యడంలేదు. అదే అసలు సమస్య. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికలు, కరోనా సెకెండ్ వేవ్ తీవ్రతకు కారణమన్నది నిర్వివాదాంశం.
కరోనా సెకెండ్ వేవ్ గురించి ముందస్తు హెచ్చరికలు ఎన్ని వున్నా.. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అదే అసలు సమస్య. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అప్పుడలా చేసి, ఇప్పుడు తీరిగ్గా ఆవేదన వ్యక్తం చేయడం వల్ల ప్రయోజనమేంటి.? ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టేది రాజకీయ నాయకులే ఎప్పుడైనా. ఇప్పుడూ అదే జరిగింది. ఓ రాజకీయ నాయకుడిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే తప్పేంటి.? అని ప్రధాని తరఫున ఎవరైనా వకాల్తా పుచ్చుకోవచ్చుగాక. కానీ, ఆయన దేశానికి ప్రధాని. ఆయన దేశ ప్రజల కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వుంటుంది.. బాథ్యగా వ్యవహరించాల్సి వుంటుంది. నదుల్లో కరోనా బాధితుల పార్తీవ దేహాల్ని విడిచిపెట్టడమంటే.. అది అంతిమ సంస్కారాలు చేయడానికి వీల్లేని దుస్థితి వల్లేనని అందరికీ అర్థమవుతోంది. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.? అని ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. లాక్ డౌన్ విధించలేకపోవడం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. సెకెండ్ వేవ్ అంచనాల నడుమ.. కొద్ది రోజులు లాక్ డౌన్ పెట్టి.. ఆంక్షలు కొంచెం కొంచెంగా సడలించి వుంటే ఇప్పుడీ దుస్థితి వచ్చేది కాదు.