కరోనా విధ్వంసం: ‘ఆ నలుగుర్నీ’ కోల్పోతున్నాం.!

Covid Pandemic: 'Aa Naluguru' Missing..

Covid Pandemic: 'Aa Naluguru' Missing..

కరోనా విధ్వంసం ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఎలా వుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, మన భారతదేశంలో పరిస్థితి మాత్రం రోజురోజుకీ అత్యంత అధ్వాన్నంగా తయారవుతోంది. ప్రతి వ్యక్తీ తనకు బాగా కావాల్సిన వారిలో కనీసం నలుగుర్ని కోల్పోతున్న వైనం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సన్నిహితులకు ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకోవాలంటే భయం.. ఎవరి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనని. అట్నుంచి ఫోన్ వచ్చినా భయమే.. ఎలాంటి వార్త చెవిన పడుతుందోనని. మానవ మేధస్సుకి సవాల్ విసురుతోంది కరోనా వైరస్. మానవత్వానికీ సవాల్ విసురుతోంది కరోనా మహమ్మారి. కరోనా వైరస్.. కోవిడ్ 19.. పేరేదైతేనేం.. మనిషినీ, మానవత్వాన్నీ చంపేయడం.. ఈ రోగం ఇప్పటిదాకా వెలుగు చూసిన రోగాలన్నటికంటే చాలా చాలా భిన్నమైనది. లక్షల్లో కరోనా బాధితులు కోలుకుంటున్నారు.. వందల్లో వేలల్లో మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారనేది అధికారిక లెక్క. మరి, ప్రతి వ్యక్తీ తన సన్నిహితుల్లో తక్కువలో తక్కువగా నలుగుర్ని ఎందుకు కోల్పోతున్నట్టు.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. వున్నపళంగా కొందరు మాయమైపోతున్నారు.

మాయమైపోవడమంటే, అప్పటిదాకా బాగానే వుండి.. అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించడం. ఆసుపత్రిలో చేరిస్తే, అట్నుంచటే మహాప్రస్తానానికి విగతజీవుల్లా వెళ్ళిపోతున్నవైనం కనిపిస్తోంది. చివరి చూపు.. అనేది గగనంగా మారిపోయింది. ఎన్నాళ్ళిలా.? గడచిన నాలుగైదు దశాబ్దాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధించాం. మానవాళి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. వాటన్నింటికంటే భిన్నమైనది ఈ కరోనా వైరస్. ఈ వైరస్ విసురుతున్న సవాల్.. అత్యంత భయానకమైనది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రపంచమంతా ఒక్కటౌతున్నా ఫలితం వుండటంలేదు. చిత్రమేంటంటే, కరోనా తొలిసారిగా వెలుగు చూసిన చైనాలో ఆల్ ఈజ్ వెల్. ప్రపంచంలోని మిగతా దేశాల్లో మాత్రం.. మొదటి వేవ్.. రెండో వేవ్.. మూడో వేవ్.. ఎందుకిలా.? ప్రపంచ దేశాలన్నీ కలిసి సమాధానం వెతకాలి ఈ ప్రశ్నకి.