వ్యాక్సినేషన్: ఏపీ సరికొత్త రికార్డు.. భయపెడ్తున్న ‘పాజిటివిటీ రేటు

Covid 19 Vaccine
Covid 19 Vaccine
 
ఆంధ్రపదేశ్ రాష్ట్రం కరోనా టెస్టుల్లో పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించిందని గత గణాంకాలు చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా టెస్టులంటూ కోవిడ్ మొదటి వేవ్ నేపథ్యంలో దాదాపు ప్రతిరోజూ ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో ‘రికార్డు స్థాయిలో’ అన్న మాట తెరపైకొస్తోంది. వ్యాక్సిన్ల కొరత కారణంగా వ్యాక్సిన్ మహోత్సవ్ కొంత అయోమయంలో పడ్డప్పటికీ, కేంద్రం తగిన స్థాయిలో వ్యాక్సిన్లను పంపడంతో, అప్పటికప్పుడు.. అత్యంత వేగంగా ఎక్కువమందికి వ్యాక్సిన్లను అందించగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, రావాల్సిన స్థాయిలో వ్యాక్సిన్లు కేంద్రం నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చే పరిస్థితి కన్పించడంలేదు.
 
నిజానికి, ఏపీ అడిగిన వ్యాక్సిన్ల కంటే చాలా తక్కువ స్థాయిలోనే కేంద్రం నుంచి వ్యాక్సిన్లు రాష్ట్రానికి వచ్చాయి.వచ్చిన వ్యాక్సిన్ల విషయంలో జాప్యతకు అస్సలేమాత్రం ఇవ్వకపోవడాన్ని అభినందించి తీరాల్సిందే. అయితే, ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. మరో వైపు, రాష్ట్రంలో అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత ఏర్పడుతోంది. ‘ఒక్క రోగినీ అదనంగా చేర్చుకునే పరిస్థితి లేదు’ అంటూ విజయవాడ ప్రభుత్వాసుపత్రి వర్గాలు వెల్లడించాయంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. హుటాహుటిన కోవిడ్ కేర్ సెంటర్లను తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకోపక్క, కోవిడ్ కేసుల పరంగా పాజిటివిటీ రేటు అనూహ్యంగా పెరుగుతోంది. అయినాగానీ, టెస్టుల సంఖ్య పెరగడంలేదు. 30 నుంచి 35 వేల లోపు టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా. అదే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే, రోజుకి లక్షకు పైగా టెస్టులు జరుగుతున్నాయి. పరిస్థితి మరింత ప్రమాదకర స్థాయికి చేరకముందే ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాల్సి వుంది.