Andhra Pradesh: ఆంధ్రపదేశ్ ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం నిన్నటి ఉదయం 10 గంటల నుంచి నేటి ఉదయం 10 గంటల వరకు (29 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు) నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,354గా నమోదయ్యింది. కరోనా వెలుగు చూశాక, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఒకే రోజు ఇంత పెద్దయెత్తున కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే చాలా మెరుగ్గా వుందని ఓ పక్క ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంటే, ఇంకోపక్క రాష్ట్రంలో కరోనా తీవ్రత నానాటికీ అనూహ్యంగా పెరిగిపోతోంది.
అయితే, కరోనా టెస్టుల సంఖ్య పెరగడంతోనే, కొత్తగా వెలుగు చూస్తోన్న పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందన్న వాదనతో పూర్తిగా ఏకీభవించలేం. కరోనా కట్టడి కోసం ఆంధ్రపదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సత్ఫలితాలనివ్వడంలేదని, పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య, రోజువారీగా నమోదవుతున్న మరణాల సంఖ్య చెప్పకనే చెబుతున్నాయి. ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో వున్నాయని మంత్రులు చెబుతున్నారు.. కానీ, ఆసుపత్రుల ప్రాంగణాల్లో అత్యంత హృదయ విదారక పరిస్థితుల్లో కోవిడ్ బాధితులు కనిపిస్తున్నారు. ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ లేకపోవడంతో, ఆటోల్లోనూ.. అంబులెన్సుల్లోనూ.. ఇతర వాహనాల్లోనూ వుండే ఆక్సిజన్ పెట్టించుకుంటున్నారు కరోనా బాధితులు.
కొందరు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా, కరోనా భూతాన్ని కట్టడి చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోలేకపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మరోపక్క, కరోనా పాండమిక్ ఎలా వున్నా, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం వుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య పెరిగితే, అందరికీ వైద్యం అందించడం కనాకష్టంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో, కరోనా కట్టడి కోసం కఠిన నిర్ణయాలు.. అదీ వీలైనంత త్వరగా తీసుకోవాల్సిందే.