కోవిడ్ 19 చికిత్స.. అప్పు తీసుకోండి, ఆసుపత్రులకు దోచిపెట్టండి.!

Covid 19 Treatment Bank Loan

Covid 19 Treatment Bank Loan

కోవిడ్ 19 చికిత్స కోసం ఓ ప్రముఖ బ్యాంకు లోన్ ఇస్తామంటోంది. ఆ అప్పుని వాయిదాల రూపంలో చెల్లించవచ్చట. గరిష్టంగా 60 నెలలపాటు నెలసరి వాయిదాలకు అవకాశం ఇస్తోంది. ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా అప్పు ఇచ్చేస్తారట. వినడానికే టెంప్టింగ్ ఆఫర్‌లా వుంది కదా ఇది.? టెంప్టింగా.? బొందా.? కరోనా సోకాలని ఎవడైనా కోరుకుంటాడా.? ఒకవేళ వచ్చినా ఐదు లక్షలు ఖర్చు చేయాలని అనుకుంటాడా.? ప్రైవేటు ఆసుపత్రులు కరోనా వైరస్ పేరు చెప్పి దోచుకుంటున్న వైనాన్ని చూస్తున్నాం. ‘ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోవద్దు.. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఉచితంగానే అందిస్తున్నాం..’ అంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

నిజానికి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాసుపత్రులే కరోనా బాధితులకు అత్యంత మెరుగైన వైద్యసౌకర్యాలు అందించాయి, అందిస్తూనే వున్నాయి. కానీ, కొందరు భయంతోనో, ఇతరత్రా కారణాలతోనే, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి దోపిడీలకు గురవుతున్నారు. ఆరోగ్యశ్రీ సౌకర్యం కూడా ప్రైవేటు ఆసుపత్రులకు గొప్ప అవకాశంగా మారుతోంది. అవసరం వున్నా, అవసరం లేకున్నా.. మెరుగైన వైద్య చికిత్స.. అంటూ దోచేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. అసలు, వైద్యం.. ప్రైవేటు పరం ఎందుకవ్వాలి.? అన్న ప్రశ్న ఎప్పటినుంచో వినిపిస్తూనే వుంది.

కానీ, ప్రభుత్వాలకి ప్రైవేటు ఆసుపత్రులంటే అదో ఇది. బహుశా ప్రభుత్వ పెద్దల్లో చాలామందికి ప్రైవేటు ఆసుపత్రులతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు వుండడం వల్లే కావొచ్చు. లేకపోతే, కరోనా పేరుతో ప్రజల్ని ప్రైవేటు ఆసుపత్రులు దోచేస్తున్నా, వాటిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు.? ఓ పక్కన ప్రైవేటు దోపిడీపై న్యాయస్థానాలు మండిపడుతున్నాయి.. దోపిడీ సొమ్ముని బాధితులకు తిరిగివ్వాలని స్పష్టం చేస్తున్నాయి. ఇంకోపక్క, ఇదిగో.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళండి.. అప్పు చేసి మరీ దోచిపెట్టండంటూ బ్యాంకులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇదో వెరైటీ మాఫియా అనుకోవాలేమో.