కరోనా మూడో వేవ్ ముప్పు: కనీస బాధ్యత లేని రాజకీయం.!

Covid 19 Third Wave, Irresponsible Political System

కరోనా సెకెండ్ వేవ్ ముప్పు దాదాపు తగ్గిందనే ప్రచారం నేపథ్యంలో రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా రోడ్డెక్కేశారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ పథకాల ప్రచారం కోసం జనాన్ని సమీకరించే ప్రయత్నాలు.. అన్నీ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నడుస్తోన్న ఈ రాజకీయం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని రాజకీయ పార్టీలూ ఇంకోసారి జనం నెత్తిన బలవంతంగా కరోనా మూడో వేవ్ రుద్దేలానే కనిపిస్తున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ దేశంలో ఏ స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగించిందో చూశాం.

వ్యాక్సినేషన్ కేంద్రాల్ని ప్రారంభించే క్రమంలో అధికార పార్టీ నాయకులు రిబ్బన్ కటింగులు చేయాలా.? ఈ క్రమంలో పెద్దయెత్తున కార్యకర్తలు, అభిమానుల్ని వెంటేసుకుని రావాలా.? కనీస పాటి బాధ్యత లేని ప్రజా ప్రతినిథులు.. సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్టు.? సంక్షేమ పథకాల విషయానికొస్తే.. జనాన్ని పోగేసి.. వారితో పబ్లిసిటీ స్టంట్లు చేయాలన్న కక్కుర్తి ఎందుకు.? నిజానికి, దేశంలో రాజకీయ నాయకులే కరోనా సూపర్ స్ప్రెడర్స్.

ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచారం, ఈ క్రమంలో పోటెత్తిన జనం.. వెరసి కరోనా సెకెండ్ వేవ్ తీవ్రతకు కారణమయ్యాయి. ఇప్పుడు మూడో వేవ్ పొంచి వుందని పలు అధ్యయనాలు చెబుతున్నా రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరించడంలేదు. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకులు.