ఒకానొక దశలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటినప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షల లోపే నమోదవుతోంది. నిజానికి, కాస్తంత సానుకూల పరిణామమే. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతోన్న లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాల సంఖ్య మాత్రం భయపెడుతోంది. కొత్త కేసులు తగ్గుతుండగా, కొత్త మరణాలు పెరుగుతుండడం ద్వరా మరణాల రేటు పెరుగుతున్నట్లే లెక్క. గతంతో పోల్చితే ఈసారి దేశవ్యాప్తంగా భిన్నమైన పరిస్థితులున్నాయి కరోనా మహమ్మారికి సంబంధించి. కొందరు తేలిగ్గా కోలుకుంటోంటే, ఇంకొందరి పరిస్థితి అనూహ్యంగా విషమిస్తోంది. రెండో వేవ్, ప్రధానంగా యువత మీద ఫోకస్ పెట్టినట్లుంది. ప్రాణాలు కోల్పోతున్నవారిలో యువత కూడా ఎక్కువగానే వుంటుండడంతో.. భయాందోళనలు ప్రజల్లో మరింతగా పెరిగిపోతున్నాయి. ఎంత భయం పెరుగుతున్నా, కరోనా పట్ల మాత్రం అప్రమత్తంగా వుండలేకపోతున్నారు. అదే అన్ని అనర్థాలకు కారణంగా చెప్పుకోవాలేమో.
వ్యాక్సినేషన్ ఒక్కటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుంచి దేశ ప్రజల్ని కాపాడగలిగేది. అయితే, ఆ వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం సజావుగా సాగడంలేదు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత, ఇతరత్రా కారణాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న దరిమిలా, సడలింపులు మళ్ళీ షురూ అవుతాయి. ఈలోగా వ్యాక్సినేషన్ జోరుగా సాగకపోతే, థర్డ్ వేవ్ రావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. మొదటి వేవ్ – రెండో వేవ్ మధ్య ఎక్కువ సమయమే పట్టినా, మూడో వేవ్ మాత్రం చాలా తొందరగా వచ్చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సినేషన్, వైద్య సౌకర్యాల పెంపు, మెడిసిన్స్ మరియు ఆక్సిజన్ లభ్యత.. వంటి విషయాలపై ప్రభుత్వాలు ముందస్తుగా అప్రమత్తమవకపోవడమే ఈ సమస్యకు కారణంగా చెప్పుకోవచ్చు.