ఏపీలో బీజేపీ అప్పుడే ‘ఆట’ మొదలెట్టేసిందిగా.!

Covid 19: BJP Mark Silly Game
Covid 19: BJP Mark Silly Game
వ్యాక్సిన్లు ఎక్కడ మహాప్రభో.. అని దేశమంతా ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తోంది. వ్యాక్సిన్ వ్యవహారాల్ని తన గుప్పిట్లో కేంద్రం పెట్టుకోవడం వల్లే ఈ దుస్థితి. వ్యాక్సిన్ ఉత్సవమైతే మొదలెట్టేసినా, అందుకు అనుగుణంగా దేశంలో వ్యాక్సిన్లు అందుబాటులో లేవాయె. ఇది ముమ్మాటికీ మోడీ సర్కారు వైఫల్యమే. ఆక్సిజన్ సమస్య, కరోనా వైరస్ సోకినవారికి వైద్య చికిత్స అందించే క్రమంలో అవసరమైన మెడిసిన్స్, బ్లాక్ ఫంగస్ మహమ్మారికి చికిత్స అందించేందుకోసం వాడే మందులు.. ఇలా ఒకటేమిటి.. అన్నిటికీ కొరతే. అన్నీ కేంద్రం కోటా ప్రకారమే రాష్ట్రాలకు రావాల్సి వుందాయె. అయినాగానీ, కేంద్రం గొప్పగా చేసేస్తోంటే రాష్ట్రం ఆ ఫలాలు అందుకోవడంలేదంటోంది ఆంధ్రపదేశ్ బీజేపీ. మొదలైపోయింది బీజేపీ రాజకీయం.. అనుకోవడానికి వీల్లేదు.. కరోనాతో జనం ప్రాణాలు పోతున్నా, బీజేపీ రాజకీయాలు అస్సలు ఆగలేదు.. కొనసాగుతూనే వున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే, ఈ బీజేపీ ఎక్కడ.? రాష్ట్రానికి వ్యాక్సిన్లు తగినంత స్థాయిలో అందకపోతే ఈ బీజేపీ ఎక్కడ.? లాంటి ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి.
 
ఇవి కీలకమైన ప్రశ్నలే. వీటితోపాటు ప్రత్యేక హోదా సహా చాలా అంశాలున్నాయి. వాటిపై బీజేపీ పెదవి విప్పదు. ఎందుకంటే, బీజేపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదు. ప్రత్యేక హోదా వస్తే, రాష్ట్రం బాగుపడిపోతుందేమోనన్న ఆందోళన బహుశా బీజేపీ పెద్దల్లో వుందేమో. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదని తిరుపతి ఉప ఎన్నిక తేల్చి చెప్పింది. జనసేన సాయం లేకపోయి వుంటే, కనీసం వెయ్యి ఓట్లన్నా బీజేపీకి తిరుపతిలో వచ్చి వుండేవి కాదేమో. కరోనా వేళ కక్కుర్తి రాజకీయాలు చేయడం బీజేపీకి తగదు. చేతనైతే, కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్ళి, రాష్ట్రానికి తగిన స్థాయిలో వ్యాక్సిన్లు రప్పించాలి కమలనాథులు. అంత సీన్ ఏపీ కమలనాథులకెక్కడ.?