కరోనా వైరస్ ఓ వైపు.. బ్లాక్ ఫంగస్ ఇంకో వైపు.. ఈ రెండిటితోపాటు.. ఇంకో వైరస్ కూడా వుంది. అదే, పుకార్ల వైరస్. ఈ ట్రిపుల్ ఎటాక్ దెబ్బకి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. అదిగో కొత్త వైరస్, ఇదిగో కొత్త ఫంగస్.. అంటూ అర్థం పర్థం లేని ప్రచారాలు తెరపైకొస్తున్నాయి. వైద్యులు బల్లగుద్ది చెబుతున్నా, ప్రజలకు బరోసా ఇస్తున్నా, దుష్ప్రచారాలు మాత్రం ఆగడంలేదు. ‘కొత్త వైరస్ ఏదో వచ్చేసిందట కదా..’ అంటూ కరోనా మ్యుటెంట్ల గురించీ, బ్లాక్ ఫంగస్ గురించీ దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇంకేముంది.. అప్పటిదాకా, అందుబాటులో వున్న కొన్ని మెడిసిన్స్ అనూహ్యంగా బ్లాక్ మార్కెట్టుకి తరలిపోతున్నాయి.
కరోనా మందులకే ఇప్పటిదాకా డిమాండ్ వుండేది.. అవే బ్లాక్ మార్కెట్టుకి తరలిపోయేవి. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే మందులు కూడా దొరకడంలేదు. వాటి గురించీ సోషల్ మీడియాలో వెతుకులాట మొదలైంది. సెలబ్రిటీలు ఆయా మందుల కోసం తమకున్న మార్గాల్ని అన్వేషిస్తూ, వాటి సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ‘బ్లాక్ ఫంగస్ కొత్తది కాదు.. మన చుట్టూనే నిత్యం వుంటుంది.. దాని గురించి అనవసరంగా భయపడాల్సిన పనిలేదు.. కరోనా బాధితులు లేదా కరోనా నుంచి కోలుకున్నవారు.. ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుల సలహా తీసుకుంటే సరి..’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ, పుకార్లు సామాన్యుల్ని మామూలుగా బతకనీయవ్ కదా.. చిన్న చిన్న అనుమానాలకే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళాల్సి వస్తోంది సామాన్యులు. దాంతో, ప్రైవేటు ఆసుపత్రులు ఇంకోసారి దోచేస్తున్నాయ్.. ఇది కరోనా దోపిడీకి అదనం.