పరుచూరి మల్లిక్ అనే వ్యక్తి ఓ కెమికల్ ఇంజనీర్. ఆయన గూగుల్ లేదా వాట్సాప్ వంటి వాటి ద్వారా సమాచారం సేకరించి మాట్లాడుతున్నాడా.? లేదంటే, పూర్తిగా కరోనా వైరస్ పట్ల అవగాహనతో మాట్లాడుతున్నాడా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆయన చేసిన వ్యాఖ్యలతో సమాజంలో అలజడి బయల్దేరుతోంది.
ఏ వ్యాక్సిన్ కూడా కరోనా వైరస్ బారి నుంచి ప్రజల్ని కాపాడలేదనీ, వ్యాక్సిన్ల వల్ల మ్యుటేషన్లు పెరిగిపోయి, వైరస్ మరింత బలోపేతమవుతుందనీ, అది మానవాళికి అత్యంత ప్రమాదకరమనీ పరుచూరి మల్లిక్ అంటున్నారు. అంతేనా, వైద్యులు.. కరోనా వైరస్ పేరుతో రోగుల్ని దోచేస్తున్నారనీ ఆరోపిస్తున్నారాయన. ఆయన వ్యాఖ్యల్లో కొంత నిజం వుండొచ్చు.
కానీ, వైద్యుల్ని మించి తానే గొప్పోడినన్నట్లు భావిస్తున్నారు పరుచూరి మల్లిక్. ఆయన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.. ఆయన్ని అరెస్ట్ చేసి, ఆ తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. అయితే, పరుచూరి మల్లిక్ మళ్ళీ మీడియాకెక్కాడు. ఓ డాక్టరుతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకు సంబంధించి ఏవేవో ప్రశ్నలు డాక్టరు ముందుంచాడు పరుచూరి మల్లిక్.
ఓ అనభవజ్ఞురాలైన డాక్టర్, పరుచూరి మల్లిక్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి రావడం దురదృష్టకరం. తన దగ్గరకు వచ్చే రోగి ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాడు.? అన్నది పూర్తిగా తెలుసుకుని వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు.
అలాంటి వైద్యుడ్ని మందుల గురించి ప్రశ్నించడమేంటి.? ఈ గందరగోళంలోకి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చి, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడమేంటి.? కరోనా వైరస్ అంటే మీడియాకి ఓ వినోద వస్తువులా మారిపోయినట్టుంది. సరైన సమాచారాన్ని ప్రజలకు అందించడంలో బాధ్యత వహించాల్సిన న్యూస్ ఛానళ్ళు ఇలాంటి చెత్త కార్యక్రమాలతో ప్రజల్ని వేధించడం మానుకుంటే మంచిదేమో.