నేడే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ : ఎవరు తీసుకోవాలి ? ఎవరు తీసుకోకూడదు?

ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో… దేశవ్యాప్తంగా నేడు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10.30 గంటలకు వర్చువల్‌ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇస్తారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ICDS సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఈ మొత్తం 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా టీకా ఎవరెవరికి ఇస్తారు. ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోకూడదు అనే విషయాలు ఒకసారి చూస్తే ….

గర్భిణులు టీకా తీసుకోకూడదు. ఈమధ్యే పిల్లల్ని కన్న బాలింతలు తొలిదశలో టీకాకు దూరంగా ఉండాలి. 18 ఏళ్లు అంతకు మించిన వయసు వారికి మాత్రమే తొలిదశలో టీకా ఇస్తారు. మొదటిసారి ఏ వ్యాక్సిన్ వేసుకుంటే, రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలి. రెండు వ్యాక్సిన్ల మధ్య గ్యాప్ కనీసం 14 రోజులు ఉండాలి.

అలర్జీ… అనఫైలాటిక్ రియాక్షన్లు ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఇంజక్షన్లతో అలర్జీ వచ్చేవారు కూడా వ్యాక్సిన్‌కి దూరంగా ఉండాలి. ప్లాస్మా థెరపీ తీసుకున్నవారికి కనీసం 4 నుంచి 8 వారాల గ్యాప్ తర్వాతే టీకా ఇవ్వాలి. సార్స్ సీవోవీ2 ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉన్నవారికి కోలుకున్నాక, 4 నుంచి 8 వారాల తర్వాత తర్వాత టీకా ఇవ్వాలి.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా తొలిదశలో టీకా ఇవ్వకూడదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. రక్తం గడ్డకట్టకుండా ఉండే సమస్య కొందరికి ఉంటుంది. అలాంటి వారు వ్యాక్సిన్ వేయించుకోకూడదు. కరోనా సోకి యాంటీబాడీస్ పొందిన వారు ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకూడదు. కనీసం 4 నుంచి 8 వారాల తర్వాతే వేయించుకోవాలి