ఏపీలో కరోనా విలయ తాండవం గురించి చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వరుసగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడుతున్నారు. మూడు రోజుల క్రితమే తుని-పాయకరావు పేట ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకేరోజు వైరస్ బారిన పడినట్లు తేలింది. మంగళవారం రాజ్యసభ సభ్యుడు, ఎంపీ విజయసాయిరెడ్డి వైరస్ బారిన పడ్డట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి కరోనా సోకిన మూడవ ఎమ్మెల్యే అంబటి కావడం విశేషం. ఇప్పటికే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యలు కరోనా బారిన పడ్డారు. సత్తెనపల్లిలో ఇప్పటి వరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు సత్తెనపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని అధికారులను అంబటి కోరారు. ఇంతలో అంబటి వైరస్ బారిన పడ్డారు. ఆ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశల తర్వాతే వైకాపా ఎమ్మెల్యేలు అంతా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.
తొలుత విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా అందరూ కరోనా బారిన పడ్డారు. ఇందులో కొంత మంది కోలుకున్నారు. ఇంకొంత మందికి పరీక్షలు చేసుకోగా ఆలస్యంగా ఫలితాలు వచ్చాయి. మొత్తానికి ప్రజా ప్రతినిధులంతా ఇలా వరుసగా కరోనా బారిన పడటం తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేలతో పాటు, వాళ్ల వద్ద పనిచేసే సిబ్బంది కూడా వైరస్ బారిన పడి కోలుకుంటున్నారు. ఇటు టీడీపీ లో కొంత మంది నేతలకు వైరస్ సోకిన సంగతి తెలిసిందే.