హైదరాబాద్ జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా వైరస్ రోజు రోజుకి ఉగ్రరూపం దాల్చుతోంది. జంటనగరాలు(హైదరాబాద్-సికింద్రాబాద్) కరోనా ధాటికి గజగజా ఒణికిపోతున్నాయి. కామన్ మ్యాన్ నుంచి కోటీశ్వరుడి వరకూ అందర్నీ మహమ్మారి చుట్టేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు భారీగా వైరస్ బారిన పడ్డారు. అటు ప్రజాప్రతినిధుల్ని పెద్ద ఎత్తున బెంబేలెత్తించింది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు వైరస్ నుంచి కోలుకుని సాధారణ జీవితంలోకి వచ్చారు. ఇంకొంత మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాజకీయ నాయకుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. కరోనా లక్షణాల్లో కూడా మార్పులు చోటు చేసుకోవడంతో వైరస్ ని పట్టుకోవడం కూడా కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు, ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.
అయినా మహమ్మారి బారిన పడిన జాబితా అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కలెక్టర్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు సమాచారం. వైరస్ కు తగ్గ మందులు వేసుకుంటూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా ఆమె కార్యాలయానికి రాలేదని సమాచారం. కరోనా లక్షణాలు ఉండటంతో ఐదు రోజుల క్రితమే పరీక్షలు చేయించుకోగా కొవిడ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అంతకు ముందే కలెక్టర్ కారు డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ కరోనా బారిన పడ్డారు. వాళ్ల నుంచి కలెక్టర్ కు సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఇప్పటివరకూ మొత్తం 15 మంది సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తెలిసిందే.తాజాగా కలెక్టర్ కూడా వైరస్ బారిన పడటంతో తాత్కలికంగా కార్యాలయం మూసివేసినట్లు సమాచారం. ప్రస్తుతం కార్యాలయాన్ని జీహెచ్ ఎంసీ కరోనా సిబ్బంది శుద్ది చేస్తున్నట్లు తెలిసింది. వైరస్ చనిపోయే వరకూ కార్యాలయం తెరిచే అవకాశం లేదని మీడియా వర్గాల సమాచారం. ఆ చుట్టు పక్కలకు ఎవరూ వెళ్లకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది.