బ్రేకింగ్ : మ‌రో అధికార పార్టీ ఎమ్మెల్యేకి క‌రోనా..!

తెలంగాణాలో కరోనా వ్యాప్తికి బ్రేక్ ప‌డ‌డంలేదు. ప్ర‌తిరోజు పెద్ద ఎత్తున క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. తెలంగాణ‌లో మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు క‌రోనా వైర‌స్ సోక‌డం క‌ల‌క‌లం రేపింది. కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద‌గౌడ్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. ఇక ఆయనతో పాటు ఆయ‌న‌ భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు కూడా కరోనా సోకింది. దీంతో వివేకాతో పాటు, కుటుంబ స‌భ్యులు అంద‌రూ, హోం క్వారంటైన్‌లోకి వెళ్ళారు. ఇక వారంరోజులుగా త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా టెస్ట్‌లు చేయించుకోవాల‌ని వివేకానంద గౌడ్ కోరారు.

ఇక తెలంగాణాలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ‌గా, కరోనా కార‌ణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 45,076కు చేరుకుంది. ఇక మొత్తంగా చూసుకుంటే, క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 415 మంది మ‌ర‌ణించ‌గా, 32,438మంది కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 12,224 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణలో అత్య‌ధికంగా క‌రోనా కేసులు నమోద‌వుతున్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసులుల్లో 557 కేసులు ఒక్క హైద‌రాబాద్‌లోనే న‌మోద‌వ‌డంతో, భాగ్య‌న‌గ‌రం మొత్తం వ‌ణుకుతుంది.