కరోనా వచ్చి, ప్రైవేటు ఆసుపత్రికి వెళితే అంతే సంగతులు.. నిలువునా దోచెయ్యడమే. చివరికి చేతులెత్తేసి, ప్రభుత్వాసుపత్రికి కరోనా బాధితుడ్ని నిర్జీవంగా పంపే ప్రైవేటు ఆసుపత్రులెన్నున్నాయ్ తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలో.? రెమిడిసివిర్ ఇంజక్షన్ అసలు ఖరీదు మూడు వేలు.. దాన్ని 30 వేల నుంచి 50 వేలకు అమ్ముతున్నోళ్ళెంతమందున్నారు.? మరో ఇంజెక్షన్ అసలు ఖరీదు 30 వేల నుంచి 40 వేలు వుంటే, దాన్ని 4 లక్షల నుంచి 10 లక్షలకు అమ్మతున్నవారెంతమంది.? రెమిడిసివిర్ ఇంజెక్షన్లలో సెలైన్ వాటర్ కలిపేసి, మోసం చేస్తున్న మోసగాళ్ళెంతమంది.? కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాంగానీ.. అంతకన్నా దారుణమైన వైరస్ మన చుట్టూనే వున్న చాలామంది అక్రమార్కుల్లో వుంది.
వాళ్ళందర్నీ నర రూప రాక్షసులుగానే భావించాలి. అంబులెన్స్ దగ్గర్నుంచి, ఆక్సిజన్ సిలెండర్ దాకా.. ఆసుపత్రి నుంచి స్మశానం దాకా.. అన్ని చోట్లా దోపిడీనే. ఈ దోపిడీ కారణంగానే చాలా ప్రాణాలు పోతున్నాయి. ఇక ఆసుపత్రుల్లో నిర్లక్ష్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతకీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? ఇంకేం చేస్తాయి.. ప్రభుత్వాల కనుసన్నల్లోనే చాలా ప్రైవేటు ఆసుపత్రులు పనిచేస్తున్నాయి.. అంటే, ప్రభుత్వాలని నడుపుతున్నవాళ్ళకీ ఈ ఆసుపత్రులతో లింకులుంటున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో వాటాలూ వుంటున్నాయి. అద్గదీ అసలు సంగతి. కానీ, వాటి గురించి ఎవరూ మాట్లాడరు. మాట్లాడాల్సి వస్తే మళ్ళీ ఇక్కడ కులం రంగు, మతం రంగు, పార్టీ రంగు.. ఇవెలాగూ వున్నాయ్. అసలు సమస్య మళ్ళీ తెరమరుగు. మృగంలా మారిపోతున్న మనిషికి కరోనా వైరస్ మొదటి వేవ్ ద్వారా ఓ అవకాశమిచ్చింది. కానీ, మారలేదు. అందుకే, రెండోసారి ఇంకొంచెం గట్టిగా చెబుతోంది. చిత్రమేంటంటే.. కొందరు మనుషులు మరింత కర్కశంగా తయారవుతున్నారు.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్నట్టు డబ్బు పోగేసుకోవడానికి ఇతరుల ప్రాణాల్ని తోడేస్తున్నారు. వాళ్ళకీ తెలుసు.. డబ్బు ప్రాణాల్ని కాపాడలేదని. అవి వాళ్ళ ప్రాణాలైనాసరే. కోటీశ్వరుడైనా కరోనాతో చనిపోతే.. అది దిక్కులేని చావే. ఇంతకీ కరోనా పాండమిక్ సమయంలో అక్రమార్కులపై హత్యకేసులెందుకు పెట్టడంలేదు ప్రభుత్వాలు.? ఇది సామాన్యుడు సంధిస్తోన్న ప్రశ్న.