అదీ ఇదీ అని లేదు.. అన్ని రంగాల్నీ కరోనా వైరస్ దెబ్బతీసింది. ఓ సెక్షన్ కార్పొరేట్ వ్యవహారాలకు తప్ప, కరోనా వైరస్ వల్ల అన్ని రంగాలకూ నష్టమే చేసింది. సినీ రంగం ప్రధానంగా కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. ఓటీటీ రూపంలో కొంత ఊరట కనిపిస్తున్నా, ఆ ఓటీటీని నమ్మకుని పెద్ద సినిమాలు రిలీజవడం కష్టమే.. అది తప్ప వేరే దారి కూడా సినీ రంగానికి కనిపించడంలేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. అన్ని సినీ పరిశ్రమలదీ ఇదే దుస్థితి.
తెలుగు సినీ పరిశ్రమలో.. సినిమాలు శరవేగంగా తెరకెక్కుతాయి.. ఎక్కువ సినిమాలూ నిర్మితమవుతాయి. తెలుగు సినిమా మార్కెట్ అంటే ఆ లెక్కలు.. మిగతా సినీ పరిశ్రమల లెక్కల కంటే భిన్నంగా వుంటాయి. తెలుగు సినిమా మార్కెట్ పెరిగి, బాలీవుడ్ మార్కెట్ స్థాయికి ఎదిగి.. అంతర్జాతీయ మార్కెట్ వైపు కూడా గట్టిగా చూస్తున్న రోజులివి. ఈ సమయంలో కరోనా చాలా గట్టిగా దెబ్బేసింది. థియేటర్లు ఎప్పుడు పూర్తిగా తెరచుకుంటాయో తెలియదు.. మళ్ళీ ఏ మహమ్మారి ముంచెత్తుతుందో తెలియదు. ఎన్ని వేవ్స్ వస్తాయో తెలియదు.
సినిమాల నిర్మాణం అయితే పునఃప్రారంభమయ్యింది రెండో వేవ్ భయాలు కాస్త తగ్గుముఖం పడుతున్న అనంతరం. కానీ, థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయ్యేదెలా.? చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అరడజను నుంచి డజను చిత్రాల దాకా కమిట్ అయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అవన్నీ పూర్తయి వరుసగా థియేటర్లలో విడుదలైతే.. ఒక్క వారం కూడా ఖాళీగా వుండదు.. ఒకే రోజు నాలుగైదు ఓ మోస్తరు నుంచి పెద్ద సినిమాలు విడుదలయ్యే పరిస్థితి వుంటుంది.. వీకెండ్స్‌లో. కానీ, అందుకు పరిస్థితులే అనుకూలించడంలేదు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కానీ, సినిమా ఆ సమయానికి వస్తుందో రాదో డౌటు. ‘రాధేశ్యామ్’ సహా చాలా సినిమాలున్నాయి.. అన్నటిదీ అదే అయోమయం. ప్రభుత్వాలు ఆదుకుంటే తప్ప సినీ పరిశ్రమ కోలుకోలేదు. కానీ, ప్రభుత్వాలు ఆదుకునేందుకు ముందుకొస్తున్నట్లు కనిపించకపోవడంతో సినీ పరిశ్రమలో పైకి కనిపించని భయం క్రమక్రమంగా మరింత పెరిగిపోతోంది.