రాజకీయాలు నాయకులు మాట్లాడే సమయంలో ఒకటి రెండు సార్లు అలోచించి మాట్లాడాలి, ముఖ్యంగా అధికారంలో ఉన్న నేతలు మాటలు చాలా పొదుపుగా వాడాలి, లేకపోతే ఆ అధికారానికి దూరం కావాల్సి వస్తుంది. తాజాగా శ్రీకాకుళంలో మంత్రి సీదిరి అప్పల్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్నే లేపుతున్నాయి.
మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కానీ, అదృష్టం కలిచొచ్చి మంత్రి పదవి దక్కించుకున్నాడు పలాస మ్మెల్యే సీదిరి అప్పల్రాజు. దీనితో శ్రీకాకుళం జిల్లాలో మెల్ల మెల్లగా తన పట్టు పెంచుకుంటున్నాడు. అదే సమయంలో ప్రత్యుర్థులను టార్గెట్ చేస్తూ గట్టిగానే విమర్శలు చేస్తున్నాడు. భూ కబ్జాల విషయంలో జిల్లాలో మంత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమార్కుల భరతం పడతామని చెప్పడమే కాదు, గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే టీడీపీ నేతలు పాల్పడిన భూ దందాలను కూడా వెలికి తీస్తామని మంత్రి హెచ్చరించారు.
ఈ క్రమంలో మంత్రి గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూడా అక్కడ తొలగిస్తామనడం టీడీపీకి అంది వచ్చిన అస్త్రమైంది. దాంతో గౌతు లచ్చన్న వంటి బీసీ నేతను అవమానిస్తారా అంటూ అచ్చెన్నాయుడుతో సహా టీడీపీ నేతలంతా మంత్రి అప్పలరాజు మీద హాట్ హాట్ విమర్శలు గుప్పించడం, పలాసలో నిరసనకు పూనుకోవడం ఉత్కంఠకు దారి తీసింది. అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన లచ్చన్న అంచెలంచెలుగా ఎదిగి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుని స్థాయికి చేరుకున్నారు. ఆయన ఎపుడూ అధికార పార్టీల విధానాలనే విమర్శించేవారు. జీవితం మొత్తం బడుగు, బలహీనుల కోసం అంకితం చేసిన నేత లచ్చన్న. అటువంటి లచ్చన్న మరణించి చాలా కాలమే అయినప్పటికీ ఆయన్ని అంతా బీసీ నేతగా కొలుస్తారు. ఆయన విగ్రహాన్ని కూలదోస్తామనడంతో మంత్రి సీదిరి ఇరకాటంలో పడ్డారు. ఇదే అదునుగా ఆయన మాటలు వాడుకోవడం ద్వారా టీడీపీ అసలైన రాజకీయ క్రీడ మొదలుపెట్టింది.
గౌతు లచ్చన్న ఎపుడూ అధికార పార్టీలో చేరలేదు. ఆయన విపక్షంలోనే కొనసాగారు. ఆయన తనయుడు గౌతు శ్యామసుందర శివాజీ, మనవరాలు గౌతు శిరీష టీడీపీలో ఉన్నారు. దాంతో ఇప్పుడు లచ్చన్నను టీడీపీ తమ వాడిగా చేసుకోవడంలో సఫలీకృతమైంది. దీంతో సిక్కోలులో బీసీల మధ్య చిచ్చు పెట్టేలా ఇది ఉందని అంటున్నారు. అచ్చెన్నాయుడు అయితే బీసీల మీద వైసీపీకి అసలు గౌరవం లేదని గట్టిగానే మాట్లాడారు. గౌతు లచ్చన్న వంటి బీసీ నేతల విగ్రహాల మీద చేయి వేస్తే ఏపీలో జగన్ సర్కార్ ఉండదని కూడా హెచ్చరించారు. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మనోభావాలకు ముడి పడింది కావటంతో మున్ముందు ఎంత వరకు వెళ్తుందో చూడాలి.