తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశాలు వుంటాయనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశాల్ని వద్దనుకుని.. తెలంగాణ రాష్ట్రాన్ని మన్మోహన్ సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది లేదు. భవిష్యత్తులో పుంజుకునేదీ లేదు.
ఔను, కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత శతృవులు చాలామంది వున్నారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికనే తీసుకుంటే, ఈ ఉప ఎన్నికలో మాజీ మంత్రి కొండా సురేఖ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆమె పోటీ చేసి వుంటే మెరుగైన ఫలితం వచ్చేదే. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా, ఆ అవకాశమే లేకుండా పోయింది.
ఎప్పుడైతే రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ అయ్యారో.. ఈ అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరిపోయాయి. వి.హనుమంతరావు, కోమటిరెడ్డి వెంటకరెడ్డి.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే.. వీళ్ళంతా సీనియర్ల ముసుగేసుకుని, పార్టీని ముంచేస్తున్నారన్న వాదనలున్నాయి.
తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వీహెచ్ బుజ్జగించారట. ‘రేపటినుంచి నేనేంటో చూపిస్తా..’ అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకేం చూపిస్తారు.? పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడి, ఆ పదవి సాధించలేక.. పార్టీ కార్యక్రమాలకు దూరమైన కోమటిరెడ్డి, పార్టీని కిందకి లాగేయడానికి తనవంతు కృషి చేశారు.
వెంటిలేటర్ మీదున్న కాంగ్రెస్ పార్టీని బాగు చేయడం ఎవరితరమూ కాదు. ఎవరికి చేతనైనంతలో వాళ్ళు ఆ మిగిలిన ఆక్సిజన్ సపోర్ట్ కూడా లేకుండా గొట్టాలు లాగేస్తోంటే, కాంగ్రెస్ తెలంగాణలో బతికే అవకాశమెలా వుంటుంది.?