చరిత్ర ఎంతో ఘనం, ప్రస్తుతం అద్వానం, భవిష్యత్తు అయోమయం. ఇది ఒక్క మాటలో చెప్పుకుంటే జాతీయ కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ బ్రిటీషర్ల నుండి దేశాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. నెహ్రు తన దార్శనికతతో దేశాభివృద్ధికి బాటలు వేశారు. కాంగ్రెస్ పార్టీలోని ఎందరో మహామహులు అవిరళ కృషితో దేశాన్ని ముందుకు నడిపారు. అస్తవ్యస్తంగా ఉన్న స్వరాజ్యానికి ఒక రూపాన్నిచ్చారు. ఆయన తర్వాత ఇందిరా గాంధీ కూడ దేశాన్ని దూకుడుగా ముందుకు తీసుకెళ్లారు. పాలనలో కొన్ని తప్పులు చేసినా దేశానికి కాంగ్రెస్ చేసిన మంచి చాలానే ఉంది. అలాంటి పార్టీ ఇప్పుడు దేశంలో ఎటూ కాకుండా పోతోంది. గత రెండు దఫాలుగా మోదీ దెబ్బకు విలవిల్లాడిపోతోంది.
యువనాయకత్వంగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ అయోమయ స్థితిలో ఉండటంతో యూపీఏ నుండి భాగస్వామ్య పార్టీలు మెల్లగా ఒక్కొక్కటిగా బయటకుపోతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురు దూరమైపోగా దాదాపు సగం రాష్ట్రాల మీద పట్టుకోల్పోతోంది హస్తం పార్టీ. వయో భారం మీదపడుతున్నా కూడ సోనియా గాంధీయే అయిష్టంగా అధ్యక్ష పదవిలో కూర్చొని ఉన్నారు. రాహుల్ చెప్పుకోదగిన వ్యూహాలేమీ చేయలేకపోతున్నారు. గత బీహార్ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీతో ఉంటే భవిష్యత్తు ఉండదనే సంకేతాలు వెళ్లిపోయాయి స్థానిక పార్టీలకు. అందుకే మెల్లగా తప్పుకునే పనిలో ఉన్నాయి. ఇప్పటికే వీడిన పార్టీల మూలంగా బలహీనపడిపోయిన కాంగ్రెస్ ఇంకొన్ని పార్టీలు కూడ హ్యాండ్ ఇస్తే నేలమట్టం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడటానికి తలపండిన కాంగ్రెస్ నేతలు ఏం చేయాలో తోచక అధిష్టానం ముందు బేజారుగా నిలబడిపోతున్నారు. ఈ తరుణంలో హైకమాండ్ కు ఒకే ఒక్క దారి కనిపిస్తోంది. అదే చిన్న పార్టీలను కలుపుకుని వెళ్లడం. పాత స్నేహితులను వెనక్కి పిలవడంతో పాటు కొత్త పార్టీలను ఆహ్వానించాలని చూస్తున్నారు. ప్రధానంగా భాజపా వ్యతిరేకులైన శరద్ పవార్, మమతా బెనర్జీలకు గాలం వేస్తున్నారు. అలాగే మోడీతో అంటీ ముట్టనట్టు ఉన్న నాయకులను కూడ కలుపుకోవాలని చూస్తున్నారు. ఈ వెతుకులాటలో ఏపీ నుండి వారికి వైఎస్ జగన్ కనిపిస్తున్నారు. అన్నీ బాగుంటే వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాల్సింది. ఎవరి తప్పిదం, ఎవరి అత్యాశ, ఎవరి అహంకారం అనేది పక్కన పెడితే పరిస్థితులైతే తారుమారయ్యాయి.
జగన్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేసి సొంత కుంపటి పెట్టుకున్నారు. సోనియా గాంధీనే ధిక్కరించారు. ఫలితంగా ఆయనకు దక్కిన మూల్యం 16 నెలల జైలు జీవితం. ఇదే జగన్ ను సమూలంగా మార్చివేసింది. ఆ జైలు గోడల నుండే భవిష్యత్తుకు పునాదులు వేసుకున్న జగన్ రాష్ట్ర కాంగ్రెస్ పతనం కావడంలో తనదైన భూమిక పోషించారు. ఇప్పుడంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి కాస్తో కూస్తో చెలిమి చేస్తున్నారు కానీ అదే కాంగ్రెస్ ఉంటే ప్రత్యక్ష యుద్ధమే పెట్టుకునేవారే. అలా యూపీఏకి బద్ద శత్రువైపోయారు జగన్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అద్వానంగా ఉంది. కుప్పకూలిపోయే స్టేజిలో ఉంది. అందుకే జగన్ సహకారం కోరుకుంటున్నారు. మరి ఆల్రెడీ పతనావస్థలో ఉన్నారు కాబట్టి జగన్ వారిని ఆడుకుంటారో లేకపోతే పొమ్మంటారా చూడాలి.