వైఎస్ జగన్ రాజకీయాల్లో ఇంట గొప్పగా నిలదొక్కుకోగలిగారు అంటే అది ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవే. జగన్ వేసే ప్రతి అడుగు వెనుక వైఎస్ ఛరీష్మా ఉంది. అదే జగన్‌ను ఇంత వేగంగా ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకురాగలిగింది. వైఎస్ఆర్ జగన్ కోసం కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే మిగల్చలేదు బలమైన క్యాడర్, ఓటు బ్యాంకును అందించారు. అదే దళిత ఓటు బ్యాంకు. దేశంలో మొత్తంలో దళితులు, మైనారిటీల మద్దతు అధికంగా ఉన్న పార్టీ కాంగ్రెస్. తొలినుంచి ఈ వర్గాలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాయి. ఈనాడు బీజేపీ అధికారంలో ఉండవచ్చు గాక.. కానీ డీఫలిత ఓటు బ్యాంక్ మాత్రం కాగ్రెస్ వద్దే ఉంది.
ఆ సంప్రదాయం మేరకే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నందు కూడ దళితులు కాంగ్రెస్ వైపే ఉండేవారు. కానీ ఇక్కడే పెద్ద తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు కాబట్టి వారంతా కాంగ్రెస్ పార్టీకి జైకొట్టారు. రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ ప్రస్ధానం మొదలైన రోజు నుండి దళితులకు పెద్ద పీట వేస్తూనే ఉన్నారు. సీట్ల కేటాయింపులు, పదవుల పంపకాలు, సంక్షేమ పథకాలు ఇలా ప్రతి విషయంలో వైఎస్ వారికి అగ్రతాంబూలం ఇచ్చారు. అందుకే దళితులు వైఎస్ కుటుంబానికి క్యాడర్ అయ్యారు. వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడమే ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్ నుండి బయటికొచ్చి జగన్ సొంత పార్టీ పెట్టడంతో దళితులంతా ఆయన వైపుకు తిరిగారు. ప్రతి ఎన్నికల్లోనూ దళిత ఓటు బ్యాంకు గణనీయంగా వైసీపీకే మద్దతు పలికింది. అలా వైఎస్ నుండి జగన్‌కు దళిత ఓటు బ్యాంక్ ఒక ఆస్తిలా సంక్రమించింది. ఇప్పుడు ఆ ఆస్తి తమది అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. అసలు సోదిలో కూడా కనిపించని ఆ పార్టీ దళితులు కాంగ్రెస్ అభిమానులని, వారిని ఎలాగైనా తమవైపుకు తెచ్చుకుంటామని అంటున్నారు. నిజమే దళితులు దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ అభిమానులు కావొచ్చు.. కానీ ఆంధ్రాలో మాత్రం వారు వైఎస్ అభిమానులే. వారిని జగన్ నుండి దూరం చేయడం అంత సులభమైన పని కాదు, కాంగ్రెస్ వల్ల అసలే కాదు.