పొలిటికల్ కారిడార్ లో మాటల యుద్ధం సహజం. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు, హద్దు మీరి కామెంట్లు చేసుకోవడం సహజంగా జరిగేదే. అయితే మహిళా నేతలపై మాత్రం కామెంట్లు చేసినా అందులో కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. లేదంటే అడ్డంగా బుక్కైపోతారు. అదీ మహిళలపై విమర్శలు చేసేటప్పుడు అవి హుందాగా ఉండాలి తప్ప హద్దు మీరితే అక్షింతలు తప్పవు. తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలాగా దొరికిపోయారు. ఫలితంగా సోషల్ మీడియాలో నెటిజనలుచే అక్షింతలు వేయించుకుం టున్నారు. ఇంతకీ బాధిత మహిళా మంత్రి ఎవరు? విమర్శించిన ఆ ఎమ్మెల్యే ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు చేసింది సాధారణ రాష్ర్ట మంత్రి పై కాదు..ఏకంగా కేంద్ర మంత్రిపైనే. అవును ఇది నిజం. మధ్య ప్రదేశ్ విదిశ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యే శశాంక్ భార్గవ ఓ కేంద్ర మహిళా మంత్రిపై పేరు చెప్పకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువగా చేతికి బంగారు గాజులు ధరించే ఓ మంత్రి ఉన్నారు. ఆమెకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. ఆమె ప్రధాన నరేంద్ర మోదీకి చాలా సన్నిహితంగా ఉన్నందున్న, ఆమె చేతులకున్న బంగారు గాజులు ప్రధానికి ఇచ్చి ఇంధన ధరల పెంపును వెనక్కి తీసుకురావాలని అభ్యర్ధించాలని కోరుతున్నానన్నారు.
దీంతో ఆ ఎమ్మెల్యేపై సోషల్ మీడియా వేదికగా మహిళా మంత్రిని అలా ఉద్దేశించి మాట్లాడుతారా? అని మండిపడుతున్నారు. విదిశ మున్సిపాలిటీ చైర్ పర్సన్, కొంత మంది బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ధ్వజమెత్తుతున్నారు. రాజకీయాల్లో చేసే విమర్శలు సహేతుకంగా ఉండాలి గానీ, ఒకర్నీ దూషించే విధంగా ఉండకూడదని సూచించారు. అయితే ఈ కామెంట్లపై ఇంకా ఆ మహిళా మంత్రి స్పందించలేదు.