విమర్శలకు కాదేదీ అనర్హం అనే మాట రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. పాలసీలు, పాలన, అవివినీతి, నిరంకుశత్వం ఇలాంటి విషయాల్లో పార్టీలు విమర్శలు చేసుకుంటే అర్థం ఉంటుంది కానీ వింత వింత కారణాలు చెప్పి విమర్శలకు దిగడం, నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉంటుంది. అలాంటి హాస్యాస్పద విమర్శలే కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారు. కేసీఆర్ తమకు కరోనా వైరస్ అంటించాలనే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు స్వయంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కాడవం గమనార్హం.
రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేతలు నిన్న రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం వారిని అడ్డుకుంది. ఎప్పటిలాగే పోలీస్ వాహనాల్లో బలవంతంగా ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. దీంతో భట్టికి కోపం వచ్చింది. పోలీస్ వాహనాలను సరిగ్గా శానిటైజేషన్ చేయలేదని, పరిశుభ్రత లేని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని, ఇదంతా తమకు వైరస్ సోకాలని కేసీఆర్ చేస్తున్న కుట్రని అన్నారు. ఈ వ్యాఖ్యల్లో భయం, జాగ్రత్త కనిపిస్తున్నా కేసీఆర్ వైరస్ సోకేలా చేస్తున్నారని అనడం హాస్యాస్పదం.
వాహనాలకు, పోలీస్ స్టేషన్లకు శానిటైజేషన్ తప్పకుండా చేయాలి. ఆ డిమాండును కాదనలేం. అలాగని తమకు వైరస్ సోకితే కేసీఆర్, డీజీపీలదే బాధ్యతని అనడం ఎంతవరకు సమంజసం. అలా అనుకుంటే తెరాస నేతలు చాలామంది వైరస్ బారినపడ్డారు. వారంతా విధుల్లో భాగంగా కార్యక్రమాల్లో పాల్గొన్నందువలనే వైరస్ సోకింది. కాబట్టి ఆ తప్పిదం ముఖ్యమంత్రిదే అంటే ఎలా. కరోనా వైరస్ అనేది వ్యక్తి కాదు కేసీఆర్ చెప్పినట్టు విని వెళ్లి కాంగ్రెస్ నేతలకు అంటుకోవడానికి. దానికి ఎలాంటి బేధాలు లేవు. పాలక పక్షం, ప్రతి పక్షం.. ఇలా ఎవరికైనా సోకే అవకాశం ఉంది.