దుబ్బాకలో ఉపఎన్నిక త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని.. కావాలని ఇతర పార్టీల అభ్యర్థులపై లేనిపోని కుట్రలు పన్ని వాళ్లను గెలవకుండా చేస్తోందంటూ రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీ తీరును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఈనేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమె ట్వీట్ చేశారు. అన్ని విధాలుగా అధికార టీఆర్ఎస్ దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలను ప్రారంభించింది. గత కొన్ని రోజుల నుంచి మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా? కాదా? అనే సందేహాలు కూడా సమాజంలో వ్యక్తం అవుతున్నాయి.. అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.
విజయశాంతి దుబ్బాక ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారానికి కూడా వెళ్లలేదు. దుబ్బాక ఉపఎన్నిక గురించి ఏనాడూ ఒక్క మాట కూడా మాట్లాడని రాములమ్మ.. ఇప్పుడు ఒక్కసారిగా.. అధికార టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడటంతో.. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొత్త ఉత్తేజం వచ్చినట్టయింది. రాములమ్మ ఇలాగే టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతూ పోతే.. ఆ పార్టీకి వ్యతిరేకత రావడం ఖాయం.. అంటూ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆరెస్ సర్వ విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆరెస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 26, 2020
గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా? కాదా? అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయి.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 26, 2020