దుబ్బాక ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మూడు ప్రధాన పార్టీలు గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఇక్కడ ఎవరు గెలిస్తే వారిదే భవిష్యత్తు అన్నట్టుంది వాతావరణం. అందుకే అధిష్టానాలు పార్టీ నేతలను పందెపు గుర్రాల్లా ఉరికిస్తున్నాయి. ఎలాగైనా తెరాస మీద పంతం నెగ్గాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీ స్టార్ లీడర్ల చేత పూర్తిస్థాయిలో పనిచేయించడానికి సూపర్ ఫార్ములాను వాడుతోంది. ఛాన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. మళ్ళీ పదవి పొందాలని ప్రజెంట్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తుంటే ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా పదవి కోసం కాచుకుని ఉన్నారు.
ఈ పోటీ మూలంగానే ముఖ్యమైన నేతల నడుమ సమన్వయం లోపించింది. చీఫ్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. ఎవరికిచ్చినా ఇంకో ఇద్దరు నొచ్చుకుంటారు. అందుకే ‘బాహుబలి’ చిత్రంలో శివగామి రమ్యకృష్ణ ఫార్ములాను ఫాలో అవుతోందట కాంగ్రెస్. ఆ చిత్రంలో ఇద్దరి కొడుకుల్లో ఎవరిని రాజును చెయ్యాలో తేల్చడానికి యుద్ధంలో శత్రువును చంపిన వారే రాజు అంటూ పరీక్ష పెడుతుంది శివగామి. అలా కాంగ్రెస్ అధిష్టానం కూడ దుబ్బాకలో పార్టీని గెలిపించిన వారికే పీసీసీ చీఫ్ పదవి కట్టబెడతామని పరీక్ష పెట్టిందట.
అందుకే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ దుబ్బాకలో పోలింగ్ బూత్ లను విభజించి ముఖ్య నాయకులకు పంచిపెట్టారట. ఎవరి బూత్ ల నుండి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఎక్కువ ఓట్లు పడతాయో వారే పీసీసీ చీఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చారట. దీంతో నాయకులంతా ఎవరి బూత్ లలో వాళ్ళు తిష్ట వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ పోటీలో గెలిచేది ఎవరు, పీసీసీ చీఫ్ పదవిని అందుకోబోయేది ఎవరో ఉప ఎన్నికల తర్వాత తేలిపోనుంది. మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే రీతిలో వ్యూహం పన్నిందన్నమాట.