2014 నుంచి 2024 వరకూ.. అంటే పదేళ్ళ పాటు హైద్రాబాద్, తెలంగాణకి రాజధాని మాత్రమే కాదు.. ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కూడా ఉమ్మడి రాజధాని. కానీ, హైద్రాబాద్ వెళ్ళేందుకు ఏపీలోని కరోనా బాధితులు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి రావడం బాధాకరం.. అంటూ పలువురు రాజకీయ నాయకులు నినదిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ, టీడీపీ మాత్రమే కాదు.. వైసీపీ కూడా ఉమ్మడి రాజధాని వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నాయి. నిజానికి, హైద్రాబాద్ మీద హక్కుల్ని చంద్రబాబు హయాంలోనే ఏపీ కొంత మేర కోల్పోయింది. మిగిలిన ఆ కాస్త హక్కునీ ఆంధ్రపదేశ్, వైఎస్ జగన్ హయాంలో కోల్పోయింది. కోల్పోవడమంటే, తనంతట తానుగా తెలంగాణకి ఉమ్మడి రాజధాని హక్కుల్ని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ధారాదత్తం చేసెయ్యడమన్నమాట.
ఈ విషయంలో వైఎస్ జగన్ సర్కార్ మరింత పెద్ద తప్పు చేసిందా.? అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి కోసం, హైద్రాబాద్ మీద హక్కులు వదిలేసుకోక తప్పలేదు. ఆ అమరావతికి గుర్తింపు రావాలంటే, ఉమ్మడి రాజధాని హైద్రాబాద్ విషయంలో కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి. అలాగని, అమరావతిని చంద్రబాబు ఉద్ధరించేశారా.? అంటే అదీ లేదు. అప్పట్లో చంద్రబాబు చేసింది తప్పే. దాన్ని వైసీపీ కొనసాగించడం ఇంకా పెద్ద తప్పు. అమరాతితోపాటు మరో రెండు రాజధానులు.. అంటూ గడచిన ఏడాదిన్నరగా వైఎస్ జగన్ ప్రభుత్వమూ పబ్లసిటీ స్టంట్లు చేస్తోంది. అవన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు.. ఉమ్మడి రాజధాని కోసం.. కరోనా నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి రావాలి.. అధికార వైసీపీ పెద్దన్న పాత్ర పోషించాలి. హైద్రాబాద్ మెడికల్ అండ్ హెల్త్ హబ్.. కరోనా నేపథ్యంలో, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి హైద్రాబాద్ అవసరం చాలా వుంది. ఆ అవసరాన్ని హక్కు ద్వారా సద్వినియోగం చేసుకోవాల్సిందే. కేసీఆర్ మెడలు వంచైనా, ఆంద్రపదేశ్ తన హక్కుల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.