సీఎం వైఎస్ జగన్ హెచ్చరికలంటే వాళ్ళకి భయం లేదా.?

సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి. ‘ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటివారిని ఉపేక్షించొద్దు. వీలైనంత త్వరగా ఆయా కేసుల్లో దోషులకు శిక్ష పడాలి..’ అంటూ అధికారుల్ని ఉద్దేశించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నా, రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడ్డంలేదు. గుంటూరులో విద్యార్థిని హత్య ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ సర్కారుపై తీవ్రస్థాయి విమర్శలొచ్చాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పట్టపగలు ఓ విద్యార్థిని గుంటూరులో దారుణ హత్యకు గురవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అస్సలేమాత్రం తేలిగ్గా కొట్టి పారేసే ఘటన కాదిది. ఆ వెంటనే గుంటూరులో ఓ చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ పోలీసులు, నిందితుల్ని వెంటనే పట్టుకోగలిగారు.

మరోపక్క, విజయనగరంలో ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించాడో దుండగుడు. వరుసగా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి.? ఎక్కడ లోపం జరుగుతోంది.? నిందితులు దొరుకుతున్నారు, కానీ.. శిక్షలు పడటమే ఆలస్యమవుతోంది. ఇలాంటి సందర్భాల్లోనే ‘ఇన్‌స్టంట్ జస్టిస్’ అనే చర్చ తెరపైకొస్తుంది. తెలంగాణలో దిశ ఘటన జరిగితే, నిందితులు వెంటనే ఎన్‌కౌంటర్‌లో చచ్చారు. అది అన్యాయం.. అంటూ పోలీసు వ్యవస్థపై కొన్న విమర్శలు వచ్చినా, మొత్తంగా దేశమంతా తెలంగాణ పోలీసుల సమర్థతను కొనియాడింది. ఆ ‘దిశ’ పేరుతోనే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ చట్టాన్ని తీసుకురావాలనుకుంది. కానీ, కేంద్రం ఈ చట్టాన్ని ఇంతవరకు ఆమోదించలేదు. కేంద్రం లేవనెత్తిన సందేహాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ చట్టం విషయమై ముందడుగు వేయలేకపోతోంది.

నిజానికి, ఇప్పుడున్న చట్టాలు చాలు, నిందితులకు దోషులకు శిక్ష పడటానికి. కానీ, అలా జరగడంలేదు. అదే మరిన్ని ఘటనలు జరగడానికి కారణమవుతోంది. వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్ల సంగతి పక్కన పెడితే, ప్రభుత్వ వైఫల్యం ఈ ఘటనల్లో సుస్పష్టం.. అని విపక్షాల నుంచి దూసుకొస్తున్న విమర్శలతో అధికార పార్టీ ఇరుకునపడుతోంది. పబ్లిసిటీ పీక్స్‌లో వుంటోంది.. పనితీరు చాలా వీక్‌గా వుంటోందన్న విమర్శలకు సమాధానం చెప్పలేని దుస్థితి అధికార వైసీపీది.