తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని అంతర్వేది పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం జగన్ ఆదేశించారు.
అంతర్వేది ఆలయ రథం దగ్ధం కాగానే.. ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో సీబీఐ విచారణకు సీఎం జగన్ ఆదేశించారు.
ఇప్పటికే కొత్త రథం తయారీకి ఏపీ ప్రభుత్వం 95 లక్షల రూపాయలను విడుదల చేసింది. మంత్రులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇప్పటికే ఈ ఘటనకు సంబందించి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి చక్రధరరావును విధుల నుంచి తప్పించారు. ఇక.. సీబీఐ విచారణలో ఈ ఘటనకు బాధ్యులెవరో తేలితే.. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనుకాడటం లేదు.
సీబీఐ విచారణకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే డీజీపీ కార్యాలయం.. సీఎం ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ పంపించింది. అయితే.. సీబీఐ విచారణకు సంబంధించి ఉత్తర్వులు రేపు వెలువడే అవకాశం ఉంది.