పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మొత్తం ఆస్తుల విలువ రూ. 16.72 లక్షలేనట. తనకు సొంత వాహనం కూడా లేదని, బంగారం కూడా 9 గ్రాములు మాత్రమే ఉందని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్నారు. ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమత ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పొందుపరిచారు.
తన వద్ద ఉన్న నికర ఆస్తుల విలువ రూ. 16.72 లక్షలేనని అఫిడవిట్‌లో మమత పేర్కొన్నారు. 2019-20లో రూ. 10,34,370 ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే, రూ. 69,255 నగదు ఉండగా, రూ. 13.53 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన రూ. 1.51 లక్షలు కూడా అందులోనే ఉందని మమత వివరించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ)లో రూ. 18,490 పొదుపు చేశానని, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించిన ఆదాయపన్నులో టీడీఎస్ రూపంలో రూ.1.85 లక్షలు వెనక్కి రావాల్సి ఉందని తెలిపారు. అలాగే, తన వద్ద 43,837 విలువైన 9 గ్రాముల బంగారం ఉందన్నారు.
కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశానని, ఎల్ఎల్‌బీ కూడా చదివానని పేర్కొన్న మమత తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవన్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 8 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మమత బరిలోకి దిగిన నందిగ్రామ్‌లో రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 1న ఎన్నికలు జరగనున్నాయి.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి వార్తతో పశ్చిమబెంగాల్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అవసరమైతే, వీల్‌చెయిర్‌లో కూర్చునే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తనపై దాడి చేశారన్న మమత ఆరోపణలపై గుర్తు తెలియని వ్యక్తులపై నందిగ్రామ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మమత ఆరోగ్యం స్థిరంగా ఉందని, రక్తంలో సోడియం స్థాయిలు కొంచెం తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. గాయమైన ఎడమ కాలికి కట్టు కట్టామని వివరించారు.