వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ ఆహారం, దుప్పట్లు అందివ్వండి. మృతుల కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ భారీ వర్షాలు, వరదలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టండి. బాధితులందరికీ అవసరమైన కిరాణ సామాగ్రి ఉచితంగా అందించండి. బియ్యం, పప్పు, కూరగాయలు అందించండి. ప్రతి ఇంటికి ఆహారం, 3 దుప్పట్లు వెంటనే అందించండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం వెంటనే 5 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తుంది.. అని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు.
వరదల వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మృతి చెందారు. అందులో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వారు 11 మంది ఉన్నారు. వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. ఒకవేళ వరదల వల్ల ఇల్లు ఎవరిదైనా కూలిపోయినా.. వాళ్లకు కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
1916 తర్వాత హైదరాబాద్ లో ఇదే మొదటి సారి
1916 సంవత్సరం తర్వాత హైదరాబాద్ లో ఒకే రోజులో ఇంత భారీ వర్షం నమోదు కావడం ఇదే ప్రథమమని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడంతో చాలా ఇళ్లలోకి నీరు చేరిందని సీఎం తెలిపారు. హైదరాబాద్ మొత్తంలో 144 కాలనీల్లో సుమారు 20 వేల ఇళ్లలోకి వరద నీరు చేరిందని సీఎం స్పష్టం చేశారు.