తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త తెలియజేశారు. ఇక నుంచి రెవెన్యూకు సంబంధించిన ఎటువంటి పనులకైనా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఎంతో పారదర్శకంగా, సులభంగా, స్నేహపూర్వకంగా అందుతాయని స్పష్టం చేశారు.
అసెంబ్లీ వేదికగా కొత్త రెవెన్యూ చట్టాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. దానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో సీఎం ప్రవేశఫెట్టారు.
కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వస్తే.. భూసమస్యల కోసం రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.
కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు భూమిని కూడా సర్వే చేయిస్తున్నట్టు సీఎం తెలిపారు.
ప్రతి సర్వే నెంబర్ కు కోఆర్డినేట్లు ఉంటాయి. ప్రతి ఏరియాకు అక్షాంశాలు, రేఖాంశాలను బేస్ చేసుకొని కొలతలు నిర్ధారిస్తాం. ఇక నుంచి కొత్త రెవెన్యూ చట్టం వల్ల భూమి కోసం గొడవలు పడే అవకాశమే ఉండదు. ఇక నుంచి రెవెన్యూ కోర్టులు కూడా ఉండవు.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
వీఆర్వో వ్యవస్థ రద్దు
వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నందున వీఆర్వోలు, వీఆర్ఏలు ఎటువంటి ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వాళ్ల ఉద్యోగ భద్రతకు ఎటువంటి ఢోకా ఉండదని.. వాళ్లకు ఉన్న ఆప్షన్లలో ఇతర శాఖల్లో ఉద్యోగాలను కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
పూర్తి పారదర్శకంగా ధరణి వెబ్ సైట్
ఇక నుంచి భూమికి సంబందించిన ప్రతి విషయం ధరణి వెబ్ సైట్ లో ఉంటుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అన్ని వివరాలు ధరణి వెబ్ సైట్ లో ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం మొత్తం 1,12,000 చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపుగా 2 కోట్ల 75 లక్షల ఎకరాలు. దాంట్లో కోటీ 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సుమారు 66 లక్షల అటవీ భూమి ఉంది. ఇవి కాకుండా మిగిలింది వ్యవసాయేతర భూమి.
ధరణి వెబ్ సైట్ ను పూర్తి పారదర్శకంగా ఉంచుతున్నాం. ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ధరణి వెబ్ సైట్ ను యాక్సెస్ చేసుకోవచ్చు. తమ భూమి వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఇఫ్పుడు వచ్చే కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికి కూడా విచక్షణాధికారం ఉండదు. ఇక నుంచి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. ఈసీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా వెబ్ సైట్ లో ఉంటాయి.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.