దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బే తాకింది. అది నిజంగా కోలుకోలేని దెబ్బే. ఒక అధికార పార్టీని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్థానంలో జరిగిన ఎన్నికల్లో ఓడించడం అనేది నిజంగా ఆ పార్టీకి మింగుడుపడని విషయం. అయినప్పటికీ.. టీఆర్ఎస్ పార్టీ ఎలాగోలా ఆ ఓటమిని కవరప్ చేసేసింది. అయితే.. దుబ్బాక ఉపఎన్నికను మంత్రి హరీశ్ రావుకు అప్పగించి… వదిలేశారు సీఎం కేసీఆర్.
అలాగే కనీసం దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలోనూ కేసీఆర్ పాల్గొనలేదు. చివరకు మంత్రి కేటీఆర్ కూడా అక్కడికి వెళ్లలేదు. కేవలం ట్రబుల్ షూటర్ హరీశ్ రావు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ తరుపున దుబ్బాకలో మకాం వేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే అక్కడ రాజకీయాలు నడిపారు. ఎన్నికలు అయిపోయే వరకు అక్కడే ఉన్నారు. హరీశ్ రావుతో పాటు.. ఇంకొందరు టీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ మకాం వేసి.. దుబ్బాక గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ.. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో గెలవలేకపోయింది.
అయితే.. ఒకరిని నమ్మి పని అప్పగిస్తే.. ఆ పని పూర్తయిపోతుందని నమ్మారు కేసీఆర్. హరీశ్ రావుకు దుబ్బాకను వదిలేశారు. అదే సీఎం కేసీఆర్ చేసిన తప్పు అన్న వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.
మరోవైపు బీజేపీ ఇదే దూకుడుతో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలవాలని ప్రయత్నిస్తోంది. దూకుడు మీదుంది. అందుకే.. ఇక తప్పదని సీఎం కేసీఆరే రంగంలోకి దిగనున్నారట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తానే ఇన్వాల్వ్ అవనున్నారట. గ్రేటర్ ఎన్నికలు ఆలస్యం అవుతున్నా కొద్దీ.. బీజేపీ నేతలు రెచ్చిపోతారని.. వీలు అయినంత తొందరగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ ఎన్నికల్లో గెలిచి.. బీజేపీ నోరు మూయించాలన్నదే కేసీఆర్ ప్లాన్.
అందుకే.. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వేగం పెంచారు. మంత్రులతో సమావేశం అవుతున్నారు. ఈసారి కేటీఆర్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ… ఎక్కడా తొందరపడొద్దని మిగితా నేతలకు చెబుతున్నారు. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. సీఎం కేసీఆరే ఈ ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయి ముందుకు వెళ్తున్నారంటే.. మున్ముందు ఇంకేం జరగబోతోందో వేచి చూడాల్సిందే.