తెలంగాణ: దళిత బంధు పథకం ప్రారంభోత్సం సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జై భీమ్… అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన సీఎం మొదటగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించి తర్వాత రాష్ట్రమంతటా అమలు జరుపుతామని స్పష్టం చేశారు. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దళితుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్లు కొనసాగాలని ప్రశ్నించిన కేసీఆర్ దళిత బంధు సొమ్ముతో నచ్చింది చేసుకోవచ్చని పేర్కొన్నారు. దళిత బంధు కింద ఇచ్చే డబ్బులకు కిస్తీల కిరికిరి లేదని 100 శాతం సబ్సిడీతో ఇస్తున్నామని సీఎం వివరణ ఇచ్చారు.
ఏడాది క్రితమే దళిత బంధు పథకం ప్రారంభం కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. ముందు వరుసలో దళిత నిరుపేదలకు దళిత బంధు పథకం అమలవుతుందని నిదానంగా దళితులందరికి అందజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన దళితులకు కూడా చివరి దశలో దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చివరి దశలో పథకాన్ని తీసుకోవాలని సీఎం కోరారు. రైతు బంధు తరహాలోనే దళిత బంధు పథకం అమలు చేస్తామని వెల్లడించారు. రెండు నెలల్లోనే అందరికీ దళిత బంధు అందుతుందన్నారు.
దళిత బంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. తెలంగాణలో 17 లక్షలకుపైగా దళిత కుటుంబాలు ఉన్నాయని, రాష్ట్రమంతా అమలు చేస్తే ఖర్ఛయ్యేది రూ. 1.30 లక్షల కోట్లు మాత్రమేనని సీఎం తెలిపారు. నిధులకు భయపడకుండా దళిత బంధు అమలు చేస్తామని తెలిపారు. దళిత బంధు పొందిన కుటుంబాలకు యధావిధిగా ప్రభుత్వ ఆసరాలు కొనసాగుతాయని వెల్లడించారు. దళిత బంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. చివర్లో 15 మంది లబ్ధిదారులకు దళిత బంధు పధకం క్రింద రూ.10 లక్షల చెక్కులను సీఎం అందించారు.