జనంలోకి సీఎం జగన్: మంత్రుల పని తీరుపై లెక్క తేల్చేస్తారా.?

CM Jagan To Decide Ministers Fate?
CM Jagan To Decide Ministers Fate?
 
కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నిజానికి, పూర్తిగా తగ్గిపోలేదు పూర్తిగా తగ్గడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. పరిస్థితులు క్రమక్రమంగా చక్కబడుతున్నాయి. జన జీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. రాజకీయ పార్టీల రాజకీయ కార్యకలాపాలూ పెరుగుతున్నాయి.
 
దాంతో, కరోనా నుంచి ఫోకస్ పాలన వైపు ఖచ్చితంగా మారుతుంది జనాల మైండ్ సెట్ పరంగా చూస్తే. ప్రభుత్వ వైఫల్యాల గురించి ఖచ్చితంగా చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఇలాంటి సమయంలోనే ప్రజల వద్దకు వెళ్ళి, వారి సమస్యల్ని తెలుసుకోవడం నాయకుడిగా వైఎస్ జగన్ బాధ్యత. ముఖ్యమంత్రి హోదాలో అధికారిక పర్యటనలు చేయడం ద్వారా, కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే అవకాశం దక్కుతుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.
 
అయితే, తమ వైఫల్యాలు ఎక్కడ బయటపడ్తాయోనని చాలామంది మంత్రులు ఆందోళన చెందడం సహజమే. వైఎస్ జగన్ పని తీరు విషయమై పెద్దగా ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. కానీ, మంత్రులే తమ స్థాయికి తగ్గట్టు పని చేయడంలేదన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. పైగా, అతి త్వరలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ కూడా చేపట్టాల్సి వుంది గనుక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
 
ముఖ్యమంత్రి అవుతూనే, మంత్రుల ఎంపిక చేపట్టినప్పుడే వైఎస్ జగన్, రెండున్నరేళ్ళ తర్వాత చాలా మార్పులుంటాయని సెలవిచ్చారు. ఆ రెండున్నరేళ్ళు పూర్తవుతున్న దరిమిలా, ఇప్పుడున్న మంత్రుల్లో సగం మందికి పైగానే పదవులు కోల్పోయే అవకాశం వుందట. పనితీరు ప్రాతిపదకన చూస్తే, అంతకన్నా ఎక్కువమందే మంత్రి పదవులు కోల్పోతారనే ప్రచారం జరుగుతోంది.