స్టీఫెన్ రవీంద్ర.. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో బాగా వినిపించిన పేరు. తెలంగాణ కేడర్ కు చెందిన ఈ ఐపీఎస్ అధికారిని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ మీద తీసుకోని రావాలని సీఎం జగన్ గట్టి ప్రయత్నాలే చేశాడంటే ఆ అధికారి ఎలాంటి సత్తా కలిగిన ఆఫీసరో అర్ధం చేసుకోవచ్చు.
గతంలో ఈ స్టీఫెన్ రవీంద్రతోనే ఏపీ సీఏం చంద్రబాబునాయుడి ఆట కట్టించాడు కేసీఆర్. అప్పట్లో కలకలం రేపిన డేటా చోరీ కేసును డీల్ చేసింది స్టీఫెన్ రవీంద్రనే. ఆ సమయంలో చంద్రబాబును స్టీఫెన్ రవీంద్ర ముప్పు తిప్పులు పెట్టారు. ఈ కేసును తవ్వి తీయడమే కాకుండా డేటా చోరీకి ఎలా పాల్పడ్డారో ఆయన అధారాలతో నిరుపించి కోర్టులో నివేదిక ఇచ్చారు.
రవీంద్ర వరంగల్ జిల్లా ఎస్పీగా నక్సలిజాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. మంచి ఫలితాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు. అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడు ఫాక్షనిజాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు. కరీంనగర్ ఎస్పీగా అవినీతిపై పోరాడి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయ వాదం కూడా ఎదుర్కొన్నారు. ఎన్నో కఠిన సవాళ్లు ఎదురైన కానీ తన బాధ్యతను నిర్వర్తించటంలో ఎన్నడూ వెనకడుగు వేయలేదని పోలీస్ వర్గాల్లో ఆయనకు పేరు.
అదే కాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పడు రవీంద్ర చీఫ్ సెక్యూరిటీ అఫీసర్ గా పనిచేశారు. బాగా నమ్మకమైన వ్యక్తి గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే సీఎం జగన్ స్టీఫెన్ విషయంలో అంత శ్రద్ద చూపించాడు. అతని కోసం కేసీఆర్ కు లేఖ రాస్తే ఆయన స్పందించకపోవటంతో, స్వయంగా ఆయన్ను కలిసి స్టీఫెన్ రవీంద్ర విషయం గురించి జగన్ అడగటంతో సీఎం కేసీఆర్ సరే అంటూ రవీంద్ర ను ఆంధ్రకు పంపించటానికి ఒప్పుకున్నాడు. అయితే డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో తిరిగి తెలంగాణకు వెళ్లిపోయారు.
తాజాగా వైసీపీ సర్కార్ మరోసారి స్టీఫెన్ విషయంలో కేంద్రానికి లేఖ రాసింది. ఈసారి ఎలాగైనా ఆయన్ని ఆంధ్రాకు తీసుకోని రావాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో ఈ విషయంపై మాట్లాడినట్లు తెలుస్తుంది. స్టీఫెన్ రవీంద్ర కనుక ఆంధ్రకు వస్తే చంద్రబాబుకు కష్ట కాలమే అనే మాటలు వినిపిస్తున్నాయి. గతంలో ఇంటెలిజెన్స్ ఐజీని ఉపయోగించుకొని జగన్ ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు, ఇప్పుడు తనకు బాగా నమ్మకస్తుడైన స్టీఫెన్ ను ఉపయోగించి బాబుకు చుక్కలు చూపించాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తుంది.