ఆంధ్రాలో అధికారం చెలాయిస్తున్న వైసీపీ పార్టీలో ఇప్పుడు ఒక పక్క మెల్లమెల్లగా అసమ్మతి స్వరాలు వినిపిస్తుంటే మరోపక్క వైసీపీ నేతల పనితీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న నేతలు తమ అధికారాన్ని ఉపయోగించి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్నాయి, దీనిపై ప్రతిపక్షాలతో సహా అనేక మీడియా సంస్థలు విమర్శలు సంధిస్తున్న కానీ, సీఎం జగన్ మాత్రం వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో రకంగా చెప్పాలంటే కనీసం వాటి గురించి కూడా జగన్ పట్టించుకోవటం లేదని తెలుస్తుంది.
ముందుగా పార్టీలో అసమ్మతి వర్గాల గురించి చూస్తే, గుడివాడలో టీడీపీ నుండి వచ్చిన వంశీ కి, వైసీపీ తరుపున పనిచేస్తున్న యార్లగడ్డకు పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి ఉంది, మరోపక్క ప్రకాశం జిల్లా చీరాలలో కూడా టీడీపీ నుండి కరణం బలరాం రావటం అక్కడి వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ కి సుతారం ఇష్టం లేదు. దీనితో ఆ ఇద్దరి మధ్య ఇంత సయోధ్య జరగలేదు సరికదా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. మున్ముందు ఇలాంటి పరిణామాలు పార్టీకి నష్టం కలిగించే అవకాశం వుంది, కానీ సీఎం జగన్ వాటిపై పెద్దగా దృష్టి పెట్టలేదు.
ఇక వైసీపీ నేతల మీద వస్తున్నా ఆరోపణల విషయానికి వస్తే ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం మీద అనేక ఆరోపణలు వచ్చాయి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కొన్ని సాక్ష్యాలు మీడియా ముందుకు తీసుకొచ్చి మరి ఆరోపణలు చేశాడు, అదే సమయంలో ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు రావటమే కాకుండా, పేకాట క్లబ్ లు నడిపిస్తూ ఆమె అనుచరులు చిక్కటం, ఆ తర్వాత వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయటం ఒక ఎత్తు అయితే, వాళ్ళ నుండి తనకు ప్రాణహాని ఉందని ఆమె చెప్పటం, ఆ తరువాత వాళ్ళ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు వెలుగుచూడటం మరో ఎత్తు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే శ్రీదేవి విషయం హాట్ టాపిక్ అయ్యింది, కానీ సీఎం జగన్ మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇలాంటి విషయాలను సీఎం జగన్ కావాలనే పట్టించుకోవటం లేదని తెలుస్తుంది. ఇలాంటి విషయాల్లో జగన్ కనుక ఇన్వాల్ అయితే ఎదో ఒక పరిణామం జరగటం ఖాయం, అలాంటివి చేస్తే ఖచ్చితంగా ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనమే అనేక సమస్యలకు పరిష్కరం అవుతుందని ఒక నానుడి ఉంది. బహుశా జగన్ దానినే అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ మౌనం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.