Close Schools : ఒమిక్రాన్: స్కూళ్ళు మూసేయ్యాలి.. బార్లు మాత్రం తెరిచెయ్యాలి.!

Close Schools : ఒమిక్రాన్ వేరియంట్‌ని ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయా.? ఒమిక్రాన్ కట్టడి కోసం ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయా.? అంటే, మొదటిదే కరెక్ట్.. అనాలేమో. నూతన సంవత్సర వేడుకల నిమిత్తం, మద్యం షాపుల్ని అదనపు సమయం తెరచుకునేలా ప్రభుత్వాలు వెసులుబాట్లు కల్పించాయి. పబ్బులు, బార్లు.. బార్లా తెరచుకున్నాయి.

ఇంకోపక్క, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో స్కూళ్ళ మూసివేత దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం గమనార్హం. అసలేం జరుగుతోంది దేశంలో.? అత్యంత వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని కేంద్రం చెబుతోంది. కానీ, ఒమిక్రాన్ కట్టడి చర్యలు తీసుకోవడంలేదు.

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందంటూ ఆందోళన చేపడితే, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరుతో అరెస్ట్ చేశారు. అదే సమయంలో, గులాబీ పార్టీ నాయకులు చేపట్టే రాజకీయ కార్యక్రమాల్లో తీవ్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగినా, పోలీసులు పట్టించుకోవడంలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజకీయ నాయకులు కోవిడ్ నిబంధనలు పట్టించడంలేదు. వ్యాక్సిన్ వేసుకోండంటూ ప్రచారం చేయడం తప్ప, ఒమిక్రాన్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలైతే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తీసుకోకపోవడం శోచనీయమే. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

గడచిన కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య చాలా చాలా వేగంగా పెరుగుతోంది. ఆరు వేలకు దిగువనున్న రోజువారీ కేసులు హఠాత్తుగా ముప్ఫయ్ వేలపైనకు ఎగబాకాయి. ఈ లెక్క లక్ష దాటేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, కేంద్రం కూడా కోవిడ్ కట్టడి చర్యలు తీసుకోకపోతే, దేశం మరో పెను విపత్తుని చూడాల్సి రావొచ్చు.