అధికారంలో ఉన్న పార్టీలో చిన్న చిన్న విభేదాలు సహజమే, పెత్తనం కోసం పోటీ అనేది ఉంటుంది. ఒక స్థాయి వరకు దాని వలన పెద్దగా ఇబ్బందులు వుండవు, శృతి మించితేనే సమస్యలు. 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా మొత్తం మీద వైసీపీ జెండా ఎరిగింది. అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకొని జిల్లాలో తిరుగులేని శక్తిగా వైసీపీ పార్టీ ఎదిగింది. ఇక తాజాగా జిల్లా కేంద్రమైన కర్నూలు నియోజకవర్గంలోనే వర్గ పోరు తారాస్థాయికి చేరుకోవటంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.
మొన్నటి ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ వైసీపీ నుండి పోటీచేసి విజయం సాధించాడు. NRI అయినా హఫీజ్ విజయం సాధించటం వెనుక మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రమేయం వుంది. జిల్లాలో సీనియర్ నేతైనా మోహన్ రెడ్డి తన రాజకీయానుభవం ఉపయోగించి హఫీజ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన మోహన్ రెడ్డి ఆ తర్వాత టీడీపీ లోకి వెళ్ళిపోయాడు. అయితే 2019 ఎన్నికల సమయానికి తిరిగి వైసీపీ లోకి వచ్చి, టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. ముందుగా హఫీజ్ కి టిక్కెట్ కంఫర్మ్ కావటంతో మోహన్ రెడ్డి కి టిక్కెట్ దొరకలేదు. దీనితో జగన్ మాటకు గౌరవించి హఫీజ్ గెలుపు కోసం పనిచేశాడు.
హఫీజ్ గెలిచిన తరవాత మోహన్ రెడ్డిని దూరంగా పెట్టినట్లు తెలుస్తుంది. దీనితో మోహన్ రెడ్డికి హఫీజ్ ఖాన్ కు మధ్య దూరం పెరిగింది. ఇదే సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి విషయంలో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆ పదవి తమ వర్గానికి ఇచ్చుకోవాలని ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. పాలక మండలి చైర్మన్ పదవి హఫీజ్ ఖాన్ తన వర్గం వాళ్ళకే ఇచ్చుకోవటం జరిగింది. ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కూడా తనవాళ్ళకి ఇచ్చుకోవటం నచ్చని మోహన్ రెడ్డి వర్గం ఎంతకైనా తెగించటానికి సిద్ధమయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో మోహన్ రెడ్డి తనకు చెప్పకుండా కొందరు కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకున్నాడని, ఎమ్మెల్యే కు చెప్పాల్సిన అవసరం లేదా..? అంటూ హఫీజ్ ఖాన్ మండిపడుతున్నాడు. పార్టీలో చేరికలు అనేవి సహజమే రోజుకు ఎంతో మంది చేరుతుంటారు, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పార్టీకి సంబంధించిన విషయమని మోహన్ రెడ్డి చెప్పటం జరిగింది. ఈ విధంగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది, మున్ముందు ఇది ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి