Cinema Tickets : సినిమా టిక్కెట్లలా పెట్రోల్ రేట్లు తగ్గితే ఎంత బావుండు.?

Cinema Tickets : బోడిగుండుకీ మోకాలుకీ ముడిపెడితే ఎలా.? అని చాలామందికి అనిపించొచ్చుగాక. పేదవాడి వినోదం.. సినిమా అతి ఖరీదైపోయిందని భావించేవారికి ఈ పోలిక కాస్త ఇబ్బందికరంగా అనిపించొచ్చు. కానీ, సాధారణ టీ ధర పది రూపాయలు దాటేసిన నేపథ్యంలో, సినిమా టిక్కెట్ ధర ఐదు రూపాయలు (కనీస ధర) అంటే, అది ఆశ్చర్యకరమే.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సినిమా టిక్కెట్ ధరలపై నియంత్రణ షురూ చేసింది. మంచిదే, పేదవాడికి వినోదం చవకగా లభిస్తే ఎవరు మాత్రం కాదంటారు.? కానీ, ఆ వినోదం తక్కువ ధరకు వస్తే సరిపోదు.. అత్యవసరాలైన నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఇలాగే తగ్గాల్సి వుంటుంది.

టమోటా ధర సెంచరీ, ఉల్లిపాయ ధర సెంచరీ.. ఏ కూరగాయ తీసుకున్నా యాభై రూపాయలకు పైనే.. ఈ పరిస్థితుల్ని తరచూ చూస్తున్నాం. వాటి మీద మాత్రం ప్రభుత్వానికి నియంత్రణ వుండడంలేదు. పోనీ, పెట్రోల్ డీజిల్ ధరల మీద ఏమన్నా నియంత్రణ వుందా.? అంటే, అదీ లేదాయె.

పెట్రో ధరల మీద పన్నుల్ని రాష్ట్రం, కేంద్రం తగ్గించుకోవచ్చు. కానీ, అలా చేస్తే.. జనోద్ధరణ అనేది కష్టమవుతుంది. జనోద్ధరణ కాదు, సంక్షేమ పథకాలు ఆగిపోతాయ్. సంక్షేమ పథకాలంటే ఓటు బ్యాంకు రాజకీయాలే మరి. లేకపోతే, ఎన్నో దశాబ్దాలుగా సంక్షేమ పథకాలు అమల్లో వున్నా, దేశంలో పేదవాళ్ళ సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడంలేదు మరి.

ఇరవై రూపాయలకు బాల్కనీ.. ఐదు రూపాయలకే నేల టిక్కెట్టు.. లభిస్తున్నట్లుగా కాకపోయినా, ఓ యాభై రూపాయలకు పెట్రోల్ ధర లభిస్తే.. ఎంత బావుండు.? యాభై కాకపోతే, 75 రూపాయలకు అయినా పెట్రోల్ ధర లభిస్తే.. సామాన్యుడి బతుకు కాస్త సాఫీగా సాగుతుంది మరి.