Cinema : సినిమా వర్సెస్ కులం.. ఎవరిదీ పాపం.?

Cinema : సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గుర్తించడంలేదా.? అలాగని ఓ మంత్రి మీడియా ముందుకొచ్చి చెప్పడం.. ఇంకో ఎమ్మెల్యే, సినీ పరిశ్రమపై దుమ్మెత్తిపోయడం ద్వారా సినిమా పరిశ్రమకేంటి నష్టం? ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇమేజ్ పాతాళానికి పడిపోతోంది వైసీపీ నేతల కారణంగా.

తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌లో ఎప్పుడో స్థిరపడింది. అంతకు ముందు ఆ సినీ పరిశ్రమ తమిళనాడు రాజధాని చెన్నయ్‌లో వుండేది. హాలీవుడ్ సినిమాల్ని మన తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసుకుంటున్నాం. అలాగని హాలీవుడ్ నటీ నటులు, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని గుర్తించాలా.?

తెలుగు నేలతో అనుబంధం వున్న ప్రతి సినీ నటుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. ‘మా ముఖ్యమంత్రిని మీరు గుర్తించడంలేదు..’ అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పడమంటే.. ముఖ్యమంత్రిని అవమానించడం లాగానే భావించాలి.

ఇక, తెలుగు సినీ పరిశ్రమలో విలన్లుగా ‘రెడ్డి’ సామాజిక వర్గాన్ని చూపించడాన్ని రెడ్డి సమాజిక వర్గానికి చెందిన ఓ వైసీపీ నేత ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో తప్పుపట్టారు. నిజానికి, ఈ విమర్శ గతంలోనూ వినిపించింది.. అయితే, అది హాస్యాస్పదమైపోయింది.

‘ఇంద్ర’ సినిమాని తీసుకుంటే, అందులో హీరో అలాగే విలన్.. ఈ ఇద్దరి సామాజిక వర్గం ‘రెడ్డి’. ‘సమరసింహారెడ్డి’ కూడా అంతే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో హీరో పాత్ర ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిది. సినిమా అనేది ఓ కళ. క్రియేటివిటీతో కూడుకున్న సినిమా రంగంలో.. అన్నీ కల్పితాలే.

కల్పిత పాత్రలకు.. ఓ కులాన్ని ఆపాదించాలని ఎవరూ అనుకోరు. అలాగని అధికార పార్టీ నేతలు భావిస్తే దాన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంతకీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇలాంటోళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు.?