‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల నేపథ్యంలో న్యూస్ ఛానళ్ళలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అసలు ఇదంతా అవసరమా.? అన్న ప్రశ్న, పోలింగ్ రోజున మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చింది. మీడియా ప్రతినిథులు సంధించిన ఈ ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి తెలివిగా సమాధానమిచ్చారు.
న్యూస్ ఛానళ్ళు పండగ చేసుకున్నాయ్ కదా.. అని చిరంజీవి నవ్వేశారు. నిజమే, ఇలాంటి వాతావరణం రావడం బాధాకరమేనని చిరంజీవి ఆ తర్వాత చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు రావాలని ఎవరూ కోరుకోరనీ, వచ్చినప్పుడు వాటికి అనుగుణంగా ఆలోచన మార్చుకోవాల్సి వుంటుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
గెలిచినవారికి తన మద్దతు ఖచ్చితంగా వుంటుందని చిరంజీవి చెప్పారు. ఏ ప్యానెల్‌కి మద్దతిచ్చారు.? అన్న ప్రశ్నకు మాత్రం చిరంజీవి సమాధానం చెప్పలేదు. పరిశ్రమలో ప్రస్తుతం పెద్దన్న అనే బాధ్యతను నిర్వహిస్తున్న చిరంజీవి, ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు.. ఎవరి తరఫునా వకాల్తా పుచ్చుకోలేదు.
‘మా’ ఎన్నికల్ని కొందరు ‘పరువు’ సమస్యగా తీసుకున్నారు.. ఇంకొందరు ఆధిపత్య పోరు.. అనుకున్నారు. కానీ, ఇవేవీ వాస్తవం కాదని, పోలింగ్ రోజున.. ఇరు ప్యానళ్ళ సభ్యులూ పరస్పరం కౌగలించుకోవడంతోనే అర్థమయిపోయింది. మరి, మీడియాలో జరిగిన రచ్చ మాటేమిటి.? అంటే, చిరంజీవి అన్నట్లు అది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోవాలేమో.