మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో అస్సలు జోక్యం చేసుకోవట్లేదు. ఇండస్ట్రీ, తన సినిమాలు తప్ప ఆయనకు ఇంకో పట్టించులేదు. పరిశ్రమ తరపున అవసరం ఉంటే తప్ప రాజకీయ నాయకులతో టచ్లోకి వెళ్లట్లేదు. ఇవన్నీ కొంతవరకు నిజమే. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ విషయంలో మాత్రం చిరు కొంత శ్రద్ద చూపుతున్నారని భోగట్టా. శ్రద్ద చూపడమంటే చొచ్చుకుని వెళ్లి గెలికేయడం కాదు. తమ్ముడికి కొన్ని ముఖ్యమైన సూచనలు మాత్రమే ఇస్తున్నారట. అలా చిరు పవన్‌కు తాజాగా చంద్రబాబు నాయుడి విషయమై ఒక సూచన చేసినట్టు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో టాక్ వినబడుతోంది.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకోవాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుండే పొత్తులకు సన్నద్ధమవుతున్నారు. జనసేన, బీజేపీలను తనతో కలుపుకోవడానికి సాయశక్తులా ట్రూ చేస్తున్నారు. వారి మాటలకు వంతపాడటం, వారి విధానాలను ఫాలోవడం లాంటివి చేసి స్నేహపూర్వక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా పవన్ కళ్యాణ్ చలించట్లేదు. మామూలుగా అయితే పవన్‌కు ఉన్న మొహమాటానికి, కొన్ని అవసరాలకి ఈపాటికి బాబు కవ్వింపులకు కొంతైనా కరిగి ఉండాలి. కానీ కరగట్లేదు. పవన్ చంద్రబాబు విషయంలో ఇలా గట్టిగా మౌనం పాటించడానికి కారణం అన్న చిరంజీవేనని ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.
రాజకీయాల్లో చిరు విజయవంతం కాకపోవచ్చు కానీ బోలెడంత అనుభవం సంపాదించుకున్నారు. ఎవరి నైజం ఎలాంటిదో, సందర్భాలను బట్టి ఎవరు ఎలాంటి ఎత్తులు వేస్తారో ఆయనకు బాగా తెలిసొచ్చింది. ఆ అనుభవంతోనే ఇప్పుడు చంద్రబాబు కూడ అవసరానికి అనుగుణంగా ఎత్తులు వేస్తున్నారని, ఆ ఎత్తులకు పడితే భవిష్యత్తు అంధకారమేనని, ఆయనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పవన్‌కు హితబోధ చేశారట చిరు. బలపడటం కోసం ఇంకొన్నేళ్లు కష్టపడినా పర్వాలేదు కానీ చంద్రబాబుతో స్నేహం వద్దనే వద్దంటున్నారట. గతంలో బాబు నైజం ఎలాంటిదో చూసిన పవన్ అన్నయ్య మాటలను బాగా చెవికెక్కించుకుని బాబు పొత్తును ఆమడ దూరంలోనే ఆపేస్తున్నారు.