మెగస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పుతూ నిత్యం సొసైటీకి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆక్సిజన్ బ్యాంక్స్ కోసం అయితే చాలా కృషి చేస్తున్నారు. ఇవే కాదు కష్టాల్లో ఉన్న చాలామందిని ఆదుకున్నారు. ఆయన్నుండి సహాయం పొందిన చాలామంది పలు సందర్భాల్లో చిరంజీవిని తలచుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నారు. చిరు చేసిన కొన్ని సహాయాల్లో బయటి ప్రపంచానికి తెలియనివి చాలానే ఉన్నాయి.
గత కొన్నిరోజులుగా చిరంజీవి చేసిన అలాంటి సహయాల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆ చర్చలో భాగంగా నెల్లూరుజిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు అనందయ్యకు చిరంజీవి 20 లక్షల సహాయం పంపారని వార్తలు వినిపించాయి. కరోనాకు మందు కనిపెట్టారనే వార్తల్లో ఆనందయ్య పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆనందయ్యకు చిరంజీవి సహాయం చేశారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామి నాయుడు తెలిపారు.