China Jiyar : ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోడానికి.! ఔను, టిక్కెట్టు అని పేరు పెడితే ఏంటి.? ప్రవేశ రుసుము.. అని పేరు పెడితే ఏంటి.? జనాల జేబులకు చిల్లు పెడుతున్నారా.? లేదా.? అన్నదే ఇక్కడ ప్రశ్న. జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. అక్కడికేదో జనాన్ని ఉద్ధరించేస్తున్నట్లు ‘అది టిక్కెట్టు కాదు, ప్రవేశ రుసుము..’ అని సెలవిచ్చారు ‘సమతామూర్తి’ సేవకుడు చిన జీయర్ స్వామీజీ.
సరే, సమతా మూర్తి విగ్రహ ప్రాంగణం, అక్కడి దేవాలయాలు.. ఆ మొత్తం వ్యవహారం నడపాలంటే దానికి బోల్డంత ఖర్చవుతుంది. భక్తుల నుంచీ, దాతల నుంచే రాబట్టాలి ఆ నిర్వహణ వ్యయాన్ని. దాతలు ఇస్తారు సరే, భక్తుల్ని ఎందుకు దోచుకోవాలి.? అంటే అది వేరే చర్చ. దేవాలయాల్లో ప్రవేశానికి టిక్కెట్టు ధరలెందుకు.? అనడిగితే ఏ ప్రభుత్వమైనా ఊరుకుంటుందా.? ఇదీ అంతే.
హైద్రాబాద్ శివార్లలో పేద్ద సమతా మూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చినజీయర్ స్వామీజీ ఎందుకో ఈ మధ్య అనూహ్యమైన వివాదాల్లోకెక్కారు. ఆయనపై వివాదాల నేపథ్యంలో ఆయనే మీడియా ముందుకొచ్చి తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. సమాజానికి మేం కళ్ళలాంటోళ్ళం.. అని సెలవిచ్చారాయన.
ఇంకా నయ్యం.. తామే సమాజ సృష్టికర్తలమని చెప్పలేదు.! ఈ మేధావులు, మహానుభావులు పుట్టక ముందు నుంచీ సమాజం వుంది.. సమాజం ముందడుగు వేస్తూనే వుంది. సరే, స్వామీజీలు మంచి బోధనలు చేస్తే తప్పు పట్టాల్సిన పనే లేదు. కానీ, ఇలాంటి వాళ్ళలో చాలామంది రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అదే అసలు సమస్య. ఇంతకీ, చినజీయర్ ఏ టైపు.? అబ్బే, నాకు రాజకీయాలు పడవు.. నేను రాజకీయాల్లోకి రానని చెప్పేశారు. ‘నేను’ అని ఆయన అనరుగానీ, ‘మేము’ అని చెప్పుకున్నారు. అద్గదీ అసలు సంగతి.