ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉపాధ్యాయులపై దౌర్యన్యం చేయడాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ.. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ నాలుగు గోడల మధ్య ఉండే ఉపాధ్యాయులను రోడ్డెక్కించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అన్నారు. ఉపాధ్యాయ బదిలీలలో రాజకీయ ప్రమేయం లేకుండా ఉండటం కోసం కౌన్సిలింగ్ విధానానికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చూడితే, జగన్మోహన్ రెడ్డి వెబ్ కౌన్సిలింగ్ పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు.
ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయుల బదిలీలో వైకాపా నాయకులు జోక్యం చేసుకుంటూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులను మద్యం షాపులలో పెట్టి వారి చేత మద్యం అమ్మించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది.
వెబ్ కౌన్సిలింగ్ లో ఉన్న లోపాలను ప్రశ్నించిన ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా సమయానికి డిఎలను ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు డిఎలను వాయిదాలలో ఇస్తానని ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది.
ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులలో సిపిఎస్ ను రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి ఇంతవరకు దానిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.
11వ పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో జగన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పబ్లిసిటీ పిచ్చితో పాఠశాలలు తెరిచి వేలాది మంది విద్యార్దులు, వందలాది మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడేలా చేశారు. నాడు-నేడు కార్యక్రమాలలో ఉపాధ్యాయులను బలవంతంగా పనిచేయించి కరోనా బారినపడేలా చేసి వారి మరణాలకు ప్రభుత్వం కారణమయ్యింది.ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పి అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.