జగన్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర దాటిపోయింది. ఈపాటికే జగన్ మీద, ఆయన ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ప్రజలకు ఒక అవగాహనా వచ్చి ఉంటుంది. మొదటిసారి ప్రభుత్వం చేస్తున్న జగన్‌కు ఈ ఫీడ్ బ్యాక్ చాలా ముఖ్యం. ఇది రానున్న మూడేళ్ళ పాలనపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మరి ఇంతకీ ప్రజల ఫీడ్ బ్యాక్ ఎలా ఉందీ అంటే కొంత ఆందోళనకరంగానే ఉందని చెబుతోంది ఒక సర్వే. ఇటీవల చెన్నైకి చెందిన ఒక సర్వే సంస్థ వైసీపీ ఎమ్మెల్యేల మీద సర్వే చేపట్టిందట. ఈ సర్వేలు జగన్ షాకయ్యే నిజాలు వెల్లడయ్యాయట. ఇప్పటికే ఈ సర్వే ఫలితాలు గురించి అమరావతిలో పెద్ద చర్చే నడుస్తోందట. దీంతో వైసీపీలో అలజడి మొదలైందని చెప్పుకుంటున్నారు.
ఇంతకీ ఆ సర్వేలో ఏం తేలిందంటే వైసీపీలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు గొప్పగా లేదని తేలిందట. జగన్ తన హవాతో, ఛరీష్మాతో పేర్లు కూడ తెలియని కొందరు వ్యక్తులను ఎమ్మెల్యేలను చేశారు. మోడాయి పదవి వచ్చిందనే ఉత్సాహమో, మళ్ళీ మళ్ళీ అవకాశం రాదనే భయమో తెలీదు కానీ వాళ్లంతా హద్దులు దాటి వెళ్ళిపోతున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు అంతర్గత కలహాలతో నలిగిపోతున్నారు. మంత్రులతో, ఎంపీలతో పొసగని వారు ఎదురుతిరిగారు. టీడీపీ నుండి పార్టీలోకి వస్తున్న నేతల కారణంగా ఇంకొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఇలా పలు కారణాల రీత్యా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండాల్సిన రీతిలో లేరు.
జగన్ కూడ ప్రభుత్వ పనుల్లో నిమగ్నమైపోయి ఉండటంతో ఆయనకు ఎమ్మెల్యేలను కలిసే సమయం దొరకట్లేదు. దీంతో నిజంగానే సమస్యలు ఉన్న ఎమ్మెల్యేలు అధినేతతో చెప్పుకునే అవకాశం లేక అస్తవ్యస్తంగా తయారయ్యారు. అసలే సంక్షేమ పథకాలన్నీ మధ్యవర్తులు లేకుండానే ప్రజలకు చేరిపోతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ రావడంతో ఎమ్మెల్యేలను అప్రోచ్ అవ్వాల్సిన అవసరం జనానికి లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలోనే ఎమ్మెల్యేలు ఎంతో జాగ్రతగా ఉండాలి. వినయంతో, సఖ్యతతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ కొందరు ఎమ్మెల్యేలు మాత్రం సొంత సమస్యలతో, అత్యాశతో మంచి పేరు తెచ్చుకోకపోగా ప్రజల్లో మరింత డీగ్రేడ్ అయిపోతున్నారు. వీళ్ళ సంగతే సదరు చెన్నై సర్వే బయటపెట్టింది.
వీళ్ళ మూలంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందట. పైనుండి జగన్ పార్టీని నిలబెట్టుకుంటూ వస్తుంటే కింద నుండి వీరు ఆయన శ్రమకు గండి కొట్టేస్తున్నారట. ఇలాగే ఇంకొన్నాళ్ళు సాగితే వచ్చే ఎన్నికల్లో ఫలితాలపై పెను ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి జగన్ కాస్త సమయం కేటాయించి అందరినీ దారిలో పెడితేనే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే చేదు అనుభవాలను చూడాల్సి వస్తుంది.