Cheap Liquor : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, 2024 ఎన్నికల దాకా ఆ పదవిలో వుంటారా.? లేదా.? ఏమోగానీ, తాను మాట్లాడే ప్రతి మాటా బీజేపీ మేనిఫెస్టోలో పెడతామంటున్నారాయన. చీప్ లిక్కర్ ధర 50 రూపాయలకు తగ్గిస్తే, ఒక్కో కుటుంబానికీ ఏడాదికి రెండు లక్షల రూపాయలు మిగులుతాయంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు సోము వీర్రాజు.
నిజానికి, సోము వీర్రాజు వ్యాఖ్యల్లో కొంత వాస్తవం లేకపోలేదు. లిక్కర్ ధర ఎంత పెరిగినా, మందు బాబులైతే లిక్కర్ తాగడం తగ్గించే ప్రసక్తే లేదు. పెట్రోల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తాయేమోగానీ, మందుబాబులకు లిక్కర్ ఎప్పటికీ షాక్ ఇవ్వలేదు. ఆ విషయం ఇటీవలే వైఎస్ జగన్ సర్కారు తెలుసుకుంది.. పెంచిన మద్యం ధరల్ని కాస్త తగ్గించాల్సి వచ్చింది.
మందుబాబులకు నిద్యం గొంతులో లిక్కర్ చుక్క పడి తీరాల్సిందే. రోజంతా కష్టపడినా, కష్టపడకపోయినా.. సాయంత్రానికి చుక్క పడనిదే ఆ రోజు గడవదు చాలామంది మందుబాబులకి. అలాంటోళ్ళే ఇప్పుడు రాజకీయ పార్టీలకు ప్రధాన ఓటు బ్యాంకుగా మారుతున్నారు.
సంక్షేమ పథకాల పేరుతో పేదరికాన్ని పోగొట్టాలని ప్రభుత్వాలు ఎంతలా ప్రయత్నిస్తున్నా, ఈ లిక్కర్ పుణ్యమా అని కుటుంబాలు సర్వనాశనమవుతూనే వున్నాయి. లిక్కర్ ధర ఒక్కటే కాదు, బియ్యం ధర అలాగే సిమెంట్ ధర కూడా తాము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని సోము వీర్రాజు చెబుతుండడం గమనార్హం.
అక్కడిదాకా ఎందుకు.? ముందైతే, పెట్రో ధరల్ని 70 రూపాయలకు తీసుకురండి.. అంటూ సోము వీర్రాజుకి సవాల్ విసురుతున్నారు అధికార వైసీపీ నేతలు. ఎవరి గోల ఎలా వున్నా, మద్యపానమే చాలా సమస్యలకు కారణం. కానీ, ఆ సమస్యాత్మకమైన మద్యపానమే ప్రభుత్వాలకి ప్రధాన ఆదాయవనరు.