బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లోలోకి ఎంట్రీ ఇవ్వడానికి ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు. పెన్ సుడియోస్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది.
ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో విలేజ్ సెట్ ఒకటి వేశారు. కానీ ఈలోపు లాక్ డౌన్ విధింపబడటంతో షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో షూటింగ్ కోసం సెట్ అలాగే ఉండిపోయింది. అయితే ఇటీవల హైదరాబాద్లో భారీగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల దెబ్బకు ఆ విలేజ్ సెట్ కాస్త డ్యామేజ్ అయిందట.
ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెట్ నిర్మించారు. యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలకమైన ఎమోషనల్ సీన్స్ ఇందులోనే చేయాలని అనుకున్నారు. కానీ వరుణుడు షాకిచ్చాడు. ఈ డ్యామేజ్ వలన కోట్లలోనే నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా.
లాక్ డౌన్ ముగిశాక షూటింగ్ మొదలుపెట్టాలి అంటే మళ్లీ సెట్ వర్క్ చేయాల్సిందే. ఇకపోతే ఈ సినిమా కాకుండా తమిళ చిత్రం ‘కర్ణన్’ను కూడ తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు శ్రీనివాస్. ‘రాక్షసుడు’ హిట్ అయిన తర్వాత నుండి శ్రీనివాస్ రీమేక్ సినిమాల మీద పడిపోయాడు.