తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే గట్టిగా ఫాలోఅవుతారు. కాబట్టే కూటములు కట్టడం, క్యాంపు రాజకీయాలు చేయడం, ఉన్నపళంగా పక్కనపెట్టడం, ఊహించనివారిని తీసుకొచ్చి పక్కన కూర్చోవెట్టుకోవడం ఆయనకే సాధ్యం. ఈ ఫార్ములా ఆయనకు అనేకసార్లు కలిసొచ్చింది కూడ. అందుకే ఇకపైన కూడ ఆయన దాన్నే ఫాలో అవ్వాలనుకుంటున్నారట. అందుకు నిదర్శనమే బీజేపీతో పొత్తు కోసం ఆయన ప్రయత్నం చేస్తుండటం. గత ఎన్నికల్లో బీజేపీని తీవ్రంగా తిట్టిపోశారు. ఏపీలోనే కాదు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్లి కూడ అదే చేశారు.
మళ్ళీ ఇప్ప్పుడు వారి చెలిమినే కోరుకుంటున్నారు. ఈ యూటర్న్ పద్దతి కేవలం రాజకీయ పార్టీల విషయంలోనే కాదు నాయకుల విషయంలో కూడ అవలంభిస్తారు. ప్రస్తుతం టీడీపీ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, కరణం బలరాం వైసీపీతో అంటకాగుతున్నారు. కేవలం అధికార పార్టీలో ఉండాలనే యావతోనే వీరంతా టీడీపీని వీడారు. వీడినోళ్లు మౌనంగా ఉండట్లేదు.. చంద్రబాబు నాయుడును ఏకిపారేస్తున్నారు. వీరి భవిష్యత్ లక్ష్యం ఒక్కటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి టికెట్ పొందటం. కానీ అదంత సులభమైన విషయం కాదు.
ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వైసిపీ నేతలు వీరితో కలవడానికి ససేమిరా అంటున్నారు. అలాంటిది ఎన్నికల్లో టికెట్ తమకి కాకుండా వారికి ఇస్తామంటే ఊరుకోరు. తిరుగుబాటు చేస్తారు. అయినా అధిష్టానం లొంగకపోతే టీడీపీతో కుమ్మక్కై టికెట్ పొందినవారిని ఓడగొడతారు. కనుక జగన్ వలస ఎమ్మెల్యేలకు అంత ఈజీగా టికెట్ ఇవ్వరు. లెక్కలు తేలకపోతే పాత వారికే టికెట్లిచ్చి వీరికి ఒట్టి చేతులు చూపిస్తారు. ఇంకేముంది ఇప్పుడు జంప్ చేసిన వారంతా రివర్స్ జంప్ చేసి టీడీపీలోకి వచ్చేస్తారు.
మరి వెన్నుపోటు పొడిచి పోయిన వాళ్లను చంద్రబాబు మళ్ళీ అక్కున చేర్చుకుంటారా అంటే అనుమానం లేకుండా అవునని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు గెలుపు గుర్రాలు. సామాజికవర్గం అండ మెండుగా ఉన్న వాళ్ళు. అందుకే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి మళ్ళీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సంగతి సదరు జంపింగ్ లీడర్లకు కూడ తెలుసు. వైసీపీలో ఏదైనా తేడా వస్తే చంద్రబాబు ఉన్నాడుగా అనే ధైర్యంతోనే వాళ్లంతా బయటకు వెళ్లారు.