కేంద్రం ఐదు రూపాయల మేర లీటరు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే, రాష్ట్రం ఏకంగా 16 రూపాయల మేర తగ్గించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేస్తున్నారు.
నిజమే, పెట్రోలు ధర సగానికి సగం తగ్గాలి. ఎందుకంటే, అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం పన్నుల పేరుతో వాహనదారుల్ని నిలువు దోపిడీ చేసేస్తోంది. ఇది ఇప్పటి కథ కాదు, ఎప్పటినుంచో నడుస్తోన్న కథ. ఇంకా గట్టిగా చెప్పాలంటే, వాహనదారుల వ్యధకి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే.
అయితే, ఆ 16 రూపాయల తగ్గింపు కేంద్రమే చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. కేంద్రం 15 రూపాయలు తగ్గించాలి.. రాష్ట్రం 20 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేస్తే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వసనీయత కాస్తంతైనా నిలబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబు కంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది.? రాష్ట్రం, చంద్రబాబు చెప్పిన స్థాయిలో పెట్రోలు, డీజిల్ మీద వ్యాట్ తగ్గించే పరిస్థితి వుండదు కదా.!
అయినాగానీ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. మంచి ప్రకటనే ఇది. కానీ, ఆలస్యం.. అమృతం విషం.. అన్నట్టుగా, పెట్రో ధరల తగ్గింపుపై ఆలస్యం ప్రభుత్వానికి అస్సలేమాత్రం మంచిది కాదు.
రాష్ట్రాలు కలసి కట్టుగా పెట్రోలు, డీజిల్ ధరలపై కేంద్ర సుంకాల్ని తగ్గించాలనే డిమాండ్ చేయడంతోపాటు, తమ పరిధిలో వ్యాట్ తగ్గింపు దిశగా రాష్ట్రాలూ మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది.